ఇజ్రాయెల్-ఇరాన్ (Israel-Iran) మధ్య ఉద్రిక్తతలు వేడెక్కుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఒక కీలక ప్రకటన చేయనున్నారు. ఇరాన్‌పై సైనిక చర్య తీసుకోవాలా వద్దా అన్న నిర్ణయాన్ని రాబోయే రెండు వారాల్లో తీసుకుంటానని ఆయన సంకేతాలిచ్చారు. ఈ మేరకు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ గురువారం మీడియాతో వెల్లడించారు.ఇరాన్‌తో చర్చలకు అవకాశం ఉంది. కానీ దేశ భద్రత క్షీణించడానికి అవకాశం ఉంటే, ట్రంప్ దాడికి వెనకాడరు, అని లెవిట్ చెప్పారు. ట్రంప్ ఎల్లప్పుడూ శాంతికి ప్రాధాన్యం ఇచ్చేవారన్నారు. అయితే శాంతిని బలంతో సాధించాలన్న ధోరణిలో ఆయన నిర్ణయాలు తీసుకుంటారని వివరించారు.
అణ్వాయుధాలపై కఠిన స్థానం
ఇరాన్ అణ్వాయుధ అభివృద్ధి దిశగా ప్రయాణిస్తోందని అమెరికా అనుమానిస్తోంది. ట్రంప్ ప్రభుత్వం, టెహ్రాన్ అణు కార్యక్రమాన్ని నిలిపివేయాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేసింది. ఒక ఒప్పందం కుదిరితే అది కఠినమైన షరతులతో ఉండాలి. యురేనియం శుద్ధిని పూర్తిగా ఆపాలి అని లెవిట్ అన్నారు.ట్రంప్ గతంలో మీడియాతో మాట్లాడుతూ, నేను దాడికి వెళ్లవచ్చు, లేదా కాదు కూడా. వచ్చే వారం చాలా కీలకం. బహుశా వారం కూడా పట్టకపోవచ్చు అంటూ సందేహం కమ్మే ప్రకటన చేశారు. దీంతో ఆయన ఏ సమయంలోనైనా సైనిక చర్యకు ఆదేశాలు ఇవ్వవచ్చన్న సందేహాలు పెరిగాయి.
ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతీకారం
ఇజ్రాయెల్ గురువారం ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు జరిపింది. దీనికి ప్రతిగా ఇరాన్ భారీ డ్రోన్లు, క్షిపణులతో బదులిచ్చింది. దక్షిణ ఇజ్రాయెల్‌లోని బీర్‌షెబా ప్రాంతంలోని సోరోకా ఆసుపత్రి కూడా ఈ దాడుల్లో నాశనం కావడం గమనార్హం. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, “ఈ దాడులకి తీవ్ర పరిణామాలు ఉంటాయి” అని హెచ్చరించారు.ఈ పరిణామాలన్నీ అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరగడానికి దారి తీసేలా ఉన్నాయి. రాబోయే రెండు వారాల్లో ట్రంప్ తీసుకునే నిర్ణయం, మిడిల్ ఈస్ట్ భవిష్యత్‌పై ఎంత ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే.
Read Also : Axiom-4 : ‘యాక్సియం-4′ ప్రయోగం మళ్లీ వాయిదా