Canada PM India Visit: కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ గురువారం నుంచి మార్చి 7 వరకు భారత్‌లో అధికారిక పర్యటన చేపట్టనున్నారు.ఒట్టావా నుంచి ముంబైకి చేరుకున్న ఆయన, ఆర్థిక సంబంధాలు బలోపేతం కోసం వ్యాపారవేత్తలతో సమావేశమవుతారు. మార్చి 2న ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. క్లీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రక్షణ, అధునాతన సాంకేతికత వంటి రంగాలలో సహకారంపై చర్చించనున్నారు.

వ్యాపార, వాణిజ్య బంధాల బలోపేతం
ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ‘సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం’ (సీఈపీఏ) ప్రక్రియను వేగవంతం చేయడం ప్రధాన అజెండాగా ఉంది. క్లీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రక్షణ, సాంకేతిక రంగాల్లో కొత్త భాగస్వామ్యాలను నెలకొల్పడంపై ఇరువురు నేతలు దృష్టి సారించనున్నారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా, వాణిజ్య, సాంకేతిక రంగాల్లో పవర్‌హౌస్‌గా ఎదుగుతోందని కెనడా ప్రధాని కార్యాలయం కొనియాడింది. 2024 నాటికి కెనడాకు భారత్ ఏడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. ఆ ఏడాది ఇరు దేశాల మధ్య 30.8 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం జరిగింది.
2030 నాటికి 50 బిలియన్ డాలర్ల లక్ష్యం
గత నవంబర్‌లో జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని మోడీ, మార్క్ కార్నీ భేటీ అయ్యారు. ఆ సమావేశంలోనే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 50 బిలియన్ డాలర్లకు పెంచాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. పెట్టుబడులు, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు భారత్-కెనడాల మధ్య అపారమైన అవకాశాలు ఉన్నాయని ప్రధాని మోడీ ఆ సందర్భంగా పేర్కొన్నారు. పాత చేదు జ్ఞాపకాలను వీడి, నూతన భాగస్వామ్యంతో ముందుకు సాగాలన్న ఇరు దేశాల సంకల్పానికి ఈ పర్యటన ఒక మైలురాయిగా నిలవనుంది.