‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తకంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki ) మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈసారి ఆయన చేసే హెచ్చరిక మాత్రం చాలామందిని ఆలోచనలో పడేస్తోంది. ప్రపంచం మరో భారీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనబోతోందని, చాలాకాలంగా పునాది వేస్తున్న ఈ సంక్షోభం ఇప్పుడే భయంకరంగా దూసుకొస్తోందని ఆయన సూచించారు.కియోసాకి అభిప్రాయం ప్రకారం ఈ సంక్షోభానికి మొదటి బీజం 1971లోనే పడింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ డాలర్‌ను బంగారం ప్రమాణం నుంచి తొలగించారు. అప్పటి నుంచి డాలర్ ఓ ఫియట్ కరెన్సీగా మారింది. అంటే దానికి ఇక బంగారంతో సంబంధం లేదు. ఇదే ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తోందని ఆయన పేర్కొన్నారు.
విద్యార్థి రుణాల సంక్షోభం – మిగిలినదాని ప్రారంభం?
అమెరికాలో ఉన్న $1.6 ట్రిలియన్ విలువైన విద్యార్థి రుణాల మార్కెట్ (Student Loan Market) కుప్పకూలే ప్రమాదంలో ఉందని రాబర్ట్ చెబుతున్నారు. ఇది మొదటి పిడుగు మాత్రమే. ఆ తర్వాత ఇంకా పెద్ద ముప్పులు వస్తాయని ఆయన అంటున్నారు. ఇది మామూలు సమస్య కాదని, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసే స్థాయిలో ఉందని హెచ్చరిస్తున్నారు.
“పొదుపు చేసిన వారు నష్టపోతారు” – ఎందుకు?
సాంప్రదాయంగా మనం డబ్బు పొదుపు చేయడాన్ని శ్రేయస్కరంగా భావిస్తాం. కానీ కియోసాకి అభిప్రాయం విభిన్నంగా ఉంది. పొదుపు చేసేవారు ఇప్పుడు నష్టపోతారు, అని ఆయన తేల్చి చెబుతున్నారు. ఫియట్ కరెన్సీ అంటే ప్రభుత్వాలు ముద్రించిన నకిలీ డబ్బు మాత్రమే. దీన్ని నిల్వ చేయడం మేలు చేయదని ఆయన స్పష్టం చేశారు.
అసలైన రక్షణ ఏమిటి?
కియోసాకి సజెస్ట్ చేస్తున్న పరిష్కారాలు క్లియర్ గా ఉన్నాయి. బంగారం, వెండి, బిట్‌కాయిన్ లాంటి అసలైన ఆస్తుల మీద పెట్టుబడి పెట్టండి. ఇవే సంక్షోభ సమయంలో మీకు రక్షణగా నిలుస్తాయని ఆయన నమ్మకం. ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూడొద్దని, తామే తామేను ‘బెయిల్ అవుట్’ చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
రిచ్ డాడ్ ప్రవచనం నిజమవుతోంది
నేను 2012లో చెప్పినట్లు, ఆ క్రాష్ ఇప్పుడు మొదలైంది. జాగ్రత్తగా ఉండండి, అని కియోసాకి తాజా ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇది మరింతగా ఆందోళన కలిగించే అంశం. అప్పట్లో ఆయన పుస్తకంలో రాసిన విషయాలు, ఇప్పుడు ఒక్కొక్కటిగా నిజమవుతున్నట్లు కనిపిస్తున్నాయి.
Read Also : Pakistani Spies: యూట్యూబర్ జ్యోతి కేసులో 11 మందిపై దేశ ద్రోహం నేరం