రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో 12 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రష్యా తరఫున యుద్ధంలో పాల్గొంటున్న వీరిలో ఇంకా 16 మంది అదృశ్యంగా ఉన్నారని తెలిపింది. మొత్తం 126 మంది భారతీయులు ఈ యుద్ధంలో పాల్గొనగా, 96 మంది సురక్షితంగా ఉన్నారని ప్రభుత్వం వెల్లడించింది.
ఇటీవలి కేరళకు చెందిన ఓ యువకుడు రష్యా తరఫున పోరాడుతూ ప్రాణాలు కోల్పోవడం భారతీయులను తీవ్రంగా కలిచివేసింది. ఈ ఘటన భారతీయుల మధ్య ఆందోళన పెంచింది. యుద్ధంలో మరణించిన భారతీయుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ, మరణాలపై దర్యాప్తు జరపాల్సిందిగా ప్రభుత్వం కోరింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అనేక మంది విదేశీయులు రష్యా లేదా ఉక్రెయిన్ తరఫున పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో భారతీయులు కూడా రష్యా తరఫున యుద్ధంలో చేరడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశీయంగా ఉన్న ఇబ్బందులు, ఉద్యోగ అవకాశాల లేమి వంటి సమస్యలే వారిని విదేశీ యుద్ధాల్లో పాల్గొనడానికి ప్రేరేపిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందించాల్సిందిగా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పిలుపు వినిపిస్తోంది. అదృశ్యంగా ఉన్న వారి గురించి సమాచారం సేకరించేందుకు ప్రభుత్వ విభాగాలు కృషి చేయాలని సూచనలు వస్తున్నాయి. భారత ప్రభుత్వం ఈ ఘటనలపై మరింత గమనించి, భారతీయులను ఇలాంటి పరిస్థితుల్లో పాల్గొనకుండా కాపాడే విధానాలను తీసుకురావాల్సి ఉంది. అంతర్జాతీయ సమస్యలలో భారతీయుల పాల్గొనడం తగదని, వారిని ప్రోత్సహించకుండా ఉండటం అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.