నిమిషం ఆలస్యం అయినా నో ఎంట్రీ..!
అమరావతి: ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 34 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. నిర్ణీత తేదీల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులను 30 నిమిషాల ముందు నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. సరిగ్గా తొమ్మిది గంటలకు గేట్లు మూసివేసారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు. కాగా జనరల్, ఓకేషనల్ కలిపి మొత్తం 26,161 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 12,936 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 13,225 మంది ఉన్నారు.

సెల్ఫోన్లు, ఇతరత్రా ఎలకా్ట్రనిక్ పరికరాలపై ఆంక్షలు
పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్‌లు, ఇతరత్రా ఎలకా్ట్రనిక్ పరికరాలను అనుమతించరు. కేంద్రాల్లో విధులు నిర్వహించే ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది కూడా సెల్‌ఫోన్‌లను పరీక్ష కేంద్రాల ప్రాంగణంలో వినియోగించకుండా ఆంక్షలు విధించారు. పరీక్ష కేంద్ర చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంట్ ఆఫీసరు మాత్రమే ఇంటర్ బోర్డు అందించిన కీప్యాడ్ సెల్‌ఫోన్‌ను వినియోగించాలి. ఇంటర్మీడియట్ రాత పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేలా అధికారులు దృష్టి సారించాలని ఎస్పీ తుహిన్‌సిన్హా ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు సంబంధించి పోలీస్ అధికారులు నిర్వహించాల్సిన విధుల గురించి ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
విద్యార్థులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు అధికారులు, సిబ్బంది అంతా అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. విద్యార్థులను సెల్‌ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ఎలకా్ట్రనిక్ పరికరాలతో పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరాదన్నారు. పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల ఉన్న జెరాక్స్ షాపులను మూసివేయించాలన్నారు.