దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ ఇటీవలే తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఉద్యోగులు వారానికి 70 గంటలు పనిచేయాలంటూ ఇటీవలే ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యల నుంచి.. ఉద్యోగులకు లేఆఫ్స్, ఫ్రెషర్స్ విషయంలో సంస్థ తీరు, శాలరీ హైక్‌లు వంటి కారణాలతో నిత్యం హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది. ఇప్పుడు తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు క్యాంపస్ లో శిక్షణ పొందుతున్న 30 నుంచి 45 మంది ట్రైనీలను తొలగించినట్లు తెలుస్తోంది. ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లో ఉత్తీర్ణత సాధించకపోవడంతో వారిని తొలగించినట్లు జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.

400 మందికిపైగా ట్రైనీలకు సంస్థ లేఆఫ్‌లు
కాగా ఇటీవలే మైసూరు క్యాంపస్‌లో శిక్షణ పొందుతున్న దాదాపు 400 మందికిపైగా ట్రైనీలకు సంస్థ లేఆఫ్‌లు ప్రకటించిన విషయం తెలిసిందే. కంపెనీ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇక ఈ వ్యవహారం ప్రధాని కార్యాలయానికి చేరడంతో కేంద్ర కార్మిక శాఖ విచారణకు కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇన్ఫీ కొత్త ఆలోచన చేసింది. తాజాగా తిరస్కరణకు గురైన ట్రైనీలకు ఓ ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది.
మైసూరు నుంచి బెంగళూరుకు రవాణా ఖర్చుల చెల్లింపు
బీపీఎమ్ మార్గాన్ని తీసుకోవడానికి ఇష్టపడని ట్రైనీలకు కంపెనీ మైసూరు నుంచి బెంగళూరుకు రవాణాతో పాటు వారు తమ స్వస్థలానికి చేరుకోవటానికి అయ్యే ప్రయాణ ఖర్చులను కూడా భరించనున్నట్లు తెలిసింది. అవసరమైతే ట్రైనీలు తమ తొలగింపు చివరి తేదీ వరకు మైసూర్‌లోని ఎంప్లాయీ కేర్ సెంటర్ లో వసతిని పొందవచ్చని వెల్లడించింది. క్యాంపస్ వీడాలనుకునే వారు మార్చి 27 లోపు దానికి సంబంధించిన వివరాలను పంచుకోవాలని కంపెనీ వెల్లడించింది. ఈ మేరకు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వెలువడుతున్నాయి.
ట్రైనీలకు ఇన్ఫోసిస్ అల్టిమేటం జారీ
రెండేళ్ల క్రితం ఫ్రెషర్ల పట్ల కఠిన వైఖరిని ప్రదర్శించిన ఇన్ఫీ.. గతేడాది వారిని విధుల్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, అందులోని కొందరు ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 7వ తేదీన కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు క్యాంపస్‌లో శిక్షణ పొందుతున్న దాదాపు 400 మంది ట్రైనీలకు లేఆఫ్‌లు ప్రకటించింది. వరుసగా మూడు సార్లు అంచనా పరీక్షల్లో విఫలమైన కారణంగా వారిని తొలగిస్తున్నట్లు తెలిపింది. ట్రైనీలను 50 మందితో కూడిన బ్యాచ్‌లుగా పిలిచి వారితో మ్యూచువల్ సెపరేషన్ లెటర్లపై సంతకాలు చేయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. సాయంత్రం 6 గంటల్లోపు ట్రైనీలంతా క్యాంపస్‌ను వీడాలని అల్టిమేటం జారీ చేసింది.
లేఆఫ్‌లు ఇవ్వడం తీవ్ర వివాదాస్పదమైన విషయం
కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు క్యాంపస్‌లో శిక్షణ పొందుతున్న దాదాపు 400 మందికిపైగా ట్రైనీలకు సంస్థ లేఆఫ్‌లు ఇవ్వడం తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం ప్రధాన మంత్రి కార్యాలయానికి చేరింది. బలవంతపు లేఆఫ్‌లపై ట్రైనీలు పీఎంవోకు ఫిర్యాదు చేశారు. ఈ తొలగింపులపై ప్రధానమంత్రి కార్యాలయానికి 100కు పైగా ఫిర్యాదులు అందాయి. ఈ విషయంలో జోక్యం చేసుకొని తమ ఉద్యోగాలు తమకు తిరిగి ఇప్పించాలంటూ ట్రైనీలు కోరారు.