CM Chandrababu : సీఎం చంద్రబాబు ఈరోజు(శనివారం) చందర్లపాడు మండలం ముప్పాళ్లకు రానున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయం ఖరారు చేసింది. ఈమేరకు అధికారులు గ్రామంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 10.15 గంటలకు ఉండవల్లిలోని నివాసం నుంచి హెలికాప్టర్‌లో సీఎం బయలుదేరి 10.30కు ముప్పాళ్లలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 10.35కు హెలిప్యాడ్ వద్ద స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను కలుసుకుంటారు. అనంతరం నాయకులతో సీఎం చంద్రబాబు పరిచయ కార్యక్రమం ఉంటుంది.

బాబూజగ్జీవన్‌రామ్ జయంతిలో పాల్గొని విగ్రహానికి నివాళులు
ఇక, 11 గంటలకు గ్రామంలోని అంబేడ్కర్ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలకు రోడ్డు మార్గంలో వెళ్తారు. పాఠశాలను పరిశీలించి విద్యార్థులు, సిబ్బందితో ప్రత్యేకంగా మాట్లాడతారు. 11.46 గంటలకు ప్రజావేదికలో పాల్గొని బాబూజగ్జీవన్‌రామ్ జయంతిలో పాల్గొని ఆయన విగ్రహానికి నివాళులర్పిస్తారు. పీ4 విధానాన్ని గ్రామస్థులకు వివరిస్తారు. ఈ కార్యక్రమానికి గ్రామస్థులను మాత్రమే అనుమతించనున్నట్లు తెలిసింది. అక్కడే విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేస్తారు. పాదరక్షల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2.04 నుంచి 3:34 గంటల వరకు నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో సమావేశమవుతారు.
500 మందితో కార్యకర్తల సమావేశం
సర్వం సిద్ధం.. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. హెలీప్యాడ్‌ను సిద్ధం చేయగా భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకొని తనిఖీలు చేపట్టారు. మూడు వేల మంది కూర్చునే విధంగా ప్రజావేదిక ప్రాంగణం సిద్ధం చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీరు, మజ్జిగ, పండ్లు, సభా ప్రాంగణంలో కూలర్లు ఏర్పాటు చేశారు. 500 మందితో కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు. 10 వేల మందికి భోజనాలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వవిప్ తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, కలెక్టర్ లక్ష్మీశ, ఆర్డీవో బాలకృష్ణ, వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.