ఇజ్రాయెల్- ఇరాన్ (Israel Iran) మధ్య ఉద్రిక్తతలు చల్లారిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్ (Stock market) సూచీలు వరుసగా రెండో రోజూ రాణించాయి. చమురు ధరలు దిగిరావడమూ మన మార్కెట్ సూచీలకు కలిసొచ్చింది. అన్ని రంగాల షేర్లు రాణించగా.. ఐటీ, మీడియా రంగ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు కూడా ఒకటిన్నర శాతం మేర రాణించాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ (Sensex) 700 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ (Nifty) 25,250 స్థాయికి చేరువైంది.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలమైన సంకేతాలతో సెన్సెక్స్ (Sensex) ఉదయం 82,448.80 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 82,055.11) వద్ద ఓ మోస్తరు లాభాల్లో ప్రారంభమైందది. రోజంతా లాభాల్లోనే కదలాడింది. ఇంట్రాడేలో

82,815.91 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి సెన్సెక్స్ (Sensex) 700 పాయింట్ల లాభంతో 82,755.51 వద్ద ముగిసింది. నిఫ్టీ (Nifty) సైతం 200 పాయింట్ల లాభంతో 25,244.75 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.07గా ఉంది.
రంగాల వారీగా షేర్ల ప్రదర్శన
బీఈఎల్, కోటక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు మినహా మిగిలిన అన్ని షేర్లూ లాభాల్లో ముగిశాయి. టైటాన్, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, టీసీఎస్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 67.60 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 3340 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గ్లోబల్ మార్కెట్ల బలమైన ట్రెండ్, గెఫియోపాలిటికల్ టెన్షన్ తగ్గుదల వల్ల సెంటిమెంట్ బలపడింది.