గతేడాది సెప్టెంబర్ నెలలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించినప్పటి నుంచి.. అమెరికాలో ఉండే విదేశీయుల్లో ఆందోళన మొదలైంది. ఎక్కడ తాము బహిష్కరణకు గురవుతామోనంటూ తెగ టెన్షన్ పడిపోతున్నారు. ముఖ్యంగా యూఎస్ 47వ అధ్యక్షుడిగా ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టడానికి కొన్ని రోజుల ముందు నుంచే.. అమెరికాలో ఉండే భారతీయ విద్యార్థులు పార్ట్ టైమ్ ఉద్యోగాలను మానేస్తున్నారు. కళాశాలలకు వెళ్లొచ్చిన తర్వాత సమయం ఉంటున్నా ఉద్యోగాలు చేసేందుకు ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు.

నాలుగు రోజుల క్రితమే అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే మొదటి రోజే వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్నామంటూ అందరికీ షాక్ ఇచ్చారు. ఓవైపు జన్మతః పౌరసత్వం రద్దు చేస్తూనే.. మరోవైపు ఎఫ్-1 వీసాపై వచ్చిన విదేశీ విద్యార్థులు నిబంధనలు ఉల్లంఘించి పనులు చేసేందుకు వీళ్లేదని చెప్పారు. దీంతో అమెరికాలో చదువుకుంటున్న భారతీయ అసలే లక్షల్లో అప్పు చేసి బాగా చదువుకుని మంచి స్థాయికి రావాలని కలలు కంటూ అమెరికాకు చేరుకున్న విద్యార్థులు.. తమ ఖర్చులు వెళ్లదీయడం కోసం అక్కడే పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తుంటారు. ముఖ్యంగా కాలేజీ అయిపోయాక.. స్థానికంగా ఉండే పెట్రోల్ బంక్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు వంటి వాటిల్లో పని చేస్తుంటారు. ఎంత కష్టమైనా సరే పడుతూ.. అక్కడే డబ్బులు సంపాదించుకుని చదువును కొనసాగిస్తుంటారు. అయితే ఎఫ్-1 వీసాలపై యూఎస్ వెళ్లిన అంతర్జాతీయ విద్యార్థులకు వారానికి 20 గంటల వరకు మాత్రమే పని చేసే అనుమతి ఉంది. కానీ ఇమ్మిగ్రేషన్ అధికారులు అనధికారిక పనిపై కఠినంగా వ్యవహరిస్తున్నారని తెలిసినప్పటి నుంచి చాలామంది పని మానేస్తున్నారు.