అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కొలువుదీరిన వేళ భారతీయుల్లో భయాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇన్నాళ్లూ అమెరికాకు ఏదో విధంగా వెళ్లిపోయి అక్కడ స్థిరపడిపోవచ్చన్న ఆలోచనతో పయనమైన వారంతా ఇప్పుడు అంతకంటే వేగంగా అగ్రరాజ్యం వదిలి తిరిగి వచ్చేందుకు సిద్దమవుతున్నారు. జన్మతః పౌరసత్వం ఇచ్చే విధానానికి మంగళం పాడేసిన అధ్యక్షుడు ట్రంప్ త్వరలో అక్కడ కొన్నేళ్లుగా వలస వచ్చిన కోటీ 40 లక్షల మందిని ఎలా తరిమేయాలన్న దానిపై కసరత్తు చేస్తున్నారు. దీంతో భారతీయులకు కంటి మీద కునుకులేకుండా పోతోంది. ముఖ్యంగా అమెరికాకు వెళ్లి అక్కడ చదువుకుంటూ పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసుకుంటున్న భారతీయ విద్యార్ధులకు ట్రంప్ ముచ్చెమటలు పట్టిస్తున్నాడు.
దీంతో వారంతా ఇప్పుడు దేశం వదిలి వెళ్లిపోతున్నారు. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం తర్వాత అమెరికాను వీడి పోతున్న భారతీయ పార్ట్ టైమ్ ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ ప్రమాణస్వీకారం వరకూ కూడా ప్రతీ రోజూ కాలేజీలకు వెళ్లి చదువు పూర్తయ్యాక పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసుకున్న వీరంతా ఆ తర్వాత మాత్రం దేశం వదిలి వెళ్లిపోతున్నారు.
![](https://vaartha.com/wp-content/uploads/2025/01/Indian-students-after-graduation-1024x585.jpg.webp)
ఇంకా అక్కడే ఉండే ఇమ్మిగ్రేషన్ చట్టాల ఉల్లంఘన కింద వీరిని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయన్న కారణంతో వీరు దేశం వదిలి వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. అమెరికన్ కాలేజీల్లో సీట్ల కోసం భారీ ఎత్తున లోన్లు తీసుకున్న వీరంతా పార్ట్ టైమ్ ఉద్యోగాలతోనే నెట్టుకొస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ కొరడా ఝళిపిస్తే అసలుకే మోసం వస్తుందని గుర్తించిన వీరంతా చదువు మానుకుని మరీ స్వదేశానికి తిరిగి వచ్చేస్తున్నారు.