Indian Parliament : ఎంపీల జీతం రూ.1 లక్ష నుంచి లక్షలకు పెంపు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సభ్యుల వేతనాలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.తాజాగా ఎంపీల జీతాలు, అలవెన్సులు, పింఛన్లను సవరించేందుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ పెంపు 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల నెల జీతం రూ.1 లక్ష నుంచి రూ.1.24 లక్షలకు పెరిగింది. అలాగే, రోజువారీ భత్యం రూ.2,000 నుంచి రూ.2,500కు పెంచారు.మాజీ ఎంపీల పింఛన్ కూడా పెరిగి, రూ.25,000 నుండి రూ.31,000కు చేరుకుంది.ఐదేళ్ల సర్వీసు తర్వాత అదనంగా లభించే పింఛన్ రూ.2,000 నుండి రూ.2,500కి పెంచారు. పార్లమెంటు సమావేశాల సమయంలోనే ఈ పెంపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

2018లో చివరిసారిగా ఎంపీల వేతనాల్లో మార్పులు చేశారు. ఆ సమయంలో ద్రవ్యోల్బణం, జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకొని, ఎంపీల మూల వేతనం రూ.1 లక్షగా నిర్ణయించారు. అప్పటి నుంచి ఎంపీలకు కార్యాలయ నిర్వహణ, ఓటర్లతో సంబంధాలు కొనసాగించేందుకు నియోజకవర్గ భత్యంగా రూ.70,000, కార్యాలయ నిర్వహణ ఖర్చుల కోసం రూ.60,000, రోజువారీ భత్యంగా రూ.2,000 లభించేవి.తాజా సవరణ ప్రకారం, వీటిని కూడా పెంచనున్నారు. ఎంపీలకు ఫోన్, ఇంటర్నెట్ వినియోగానికి ప్రత్యేక భత్యం లభిస్తుంది.వార్షికంగా 34 ఉచిత దేశీయ విమాన ప్రయాణాలు, ఎప్పుడైనా ఫస్ట్ క్లాస్ రైలు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే మైలేజ్ అలవెన్స్ పొందే వీలుంటుంది.
అంతేకాకుండా సంవత్సరానికి 50,000 యూనిట్ల ఉచిత విద్యుత్, 4,000 కిలోలీటర్ల ఉచిత నీరు అందజేస్తారు. ఎంపీల ఐదేళ్ల పదవీకాలంలో ఢిల్లీలో అద్దె లేని నివాస సౌకర్యం లభిస్తుంది.సీనియారిటీ ఆధారంగా హాస్టల్ గదులు, అపార్ట్‌మెంట్లు లేదా బంగ్లాలు కేటాయిస్తారు. అయితే అధికారిక వసతిని ఉపయోగించకూడదనుకునే ఎంపీలు, నెలవారీ గృహ అద్దె భత్యం పొందే అర్హత కలిగి ఉంటారు. నూతన వేతనాలు భత్యాల పెంపుతో ఎంపీల జీవిత విధానం మరింత లాభదాయకంగా మారనుంది.అయితే ప్రజలకు సేవ చేయడంలో ఈ పెంపు ఎంతవరకు ప్రభావం చూపిస్తుందనేది గమనించాల్సిన విషయం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.