దుబాయ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ రెండో మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆసక్తికర సమరం కొనసాగుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి మ్యాచ్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన భారత్, ఈ మ్యాచ్‌లో మరింత దూకుడుగా ఆడాలని చూస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ కు తొలి నుంచే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అది కూడా రెండు పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.

షమీ దెబ్బకు మరో వికెట్ కోల్పోయిన బంగ్లా:
మొదటి ఓవర్లోనే మహ్మద్ షమీ బంగ్లా బ్యాటింగ్‌కు తొలి షాక్ ఇచ్చాడు. తన ఆట ప్రారంభంలోనే ఓపెనర్‌ను పెవిలియన్ పంపించాడు. ఇక రెండో ఓవర్లో హర్షిత్ రాణా అదరగొట్టాడు. తన ధాటికి మరో వికెట్ కోల్పోయిన బంగ్లా ఒత్తిడిలో పడింది. రెండు వికెట్లు పడిపోయిన తర్వాత బంగ్లా బ్యాటర్లు కాసేపు నిలదొక్కుకున్నట్లు కనిపించినా, షమీ మరోసారి దాడి చేసి బంగ్లా ఆశలకు గండికొట్టాడు. మెహదీ హసన్ మీరాజ్‌ను పెవిలియన్ పంపించి మూడో వికెట్ తీశాడు.
అనంతరం బౌలింగ్ కి దిగిన అక్షర్ పటేల్ తన తొలి ఓవర్ లోనే రెండు వికెట్లు తీసి, బంగ్లా టైగర్స్ ను పీకలోతు కష్టాల్లోకి నెట్టేశాడు. దీంతో ప్రత్యర్థి జట్టు 35 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో సౌమ్య సర్కార్, కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో, ముష్ఫికర్ రహీమ్ డకౌట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజులో తౌహిద్ హృదయ్ (10 బ్యాటింగ్), జాకర్ అలీ (6 బ్యాటింగ్) ఉండగా బంగ్లాదేశ్ స్కోరు 49/5 (12 ఓవర్లు). జాకర్ అలీ (6 బ్యాటింగ్) నిలబడి ఉన్నప్పటికీ, భారీ స్కోరు సాధించేందుకు ఆస్కారం కనిపించడం లేదు. భారత బౌలింగ్ దాడిని తట్టుకొని బంగ్లా బ్యాటర్లు పుంజుకుంటారా? లేక త్వరలోనే ఆల్‌అవుట్ అవుతారా అనేది చూడాలి.