Earthquake : మయన్మార్, థాయిలాండ్ భారీ భూకంపాలు కుదిపేసిన విషయం తెలిసిందే. పెనువిధ్వంసంతో రెండు దేశాల ప్రజలు గజగజవణికిపోయారు. భూకంపాల ధాటికి మృతుల సంఖ్య గంటకు పెరుగుతోంది. మయన్మార్, థాయిలాండ్ లో మృతిచెందిన వారి సంఖ్య 16వందలకు చేరింది. శిధిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. శుక్రవారం మయన్మార్‌లో భారీ భూకంపం సంభవించగా, శనివారం ప్రధాని మోడీ ఆదేశాల మేరకు భారీ సహాయాన్ని పంపించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ‘ఆపరేషన్ బ్రహ్మ’గా నామకరణం
ఆదివారం కూడా 30 టన్నుల విపత్తు సహాయాన్ని తరలించారు. వివిధ రకాల ఆహార వస్తువులతో పాటు వైద్య సామాగ్రిని యాంగోన్‌కు పంపించారు. భారత నావికాదళ నౌకలు ఐఎన్ఎస్ కర్మూక్, ఎల్ సీ యూ 52 లలో 30 టన్నుల సాయాన్ని పంపినట్లు విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. బాధిత దేశానికి సహాయం అందించే ఈ కార్యక్రమానికి ‘ఆపరేషన్ బ్రహ్మ’గా నామకరణం చేశారు. ఆపరేషన్ బ్రహ్మ కొనసాగుతోందని కేంద్ర మంత్రి తెలిపారు.
భూ ఉపరితలానికి 10 కి.మీ లోతులోనే భూకంప కేంద్రాలు
మయన్మార్ మళ్లీమళ్లీ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. పెద్దఎత్తున భవనాలు, మౌలిక సదుపాయాలు దెబ్బతింటున్నాయి. భూ ఉపరితలానికి 10 కి.మీ లోతులోనే భూకంప కేంద్రాలు ఉన్నాయని అమెరికా భూ వైజ్ఞానిక సర్వే సంస్థ వెల్లడించింది. మృతుల సంఖ్య 10 వేలు దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇప్పటివరకు 1,644 మందికి పైగా మృతులను గుర్తించారు. మాండలే వీధుల్లో మృతదేహాలు కుళ్లిపోతుండటంతో దుర్గంధం వెలువడుతోంది. మండుటెండలో ఉత్త చేతులతో, చిన్నచిన్న పారలతో శిథిలాలను తొలగిస్తూ, ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమో తెలుసుకునేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు.