లేజర్ టెక్నాలజీతో అనుమానిత డ్రోన్లు, శత్రు క్షిపణులను ధ్వంసం చేసే వ్యవస్థను విజయవంతంగా పరీక్షించినట్లు భారత్ ప్రకటించింది. కర్నూలు సమీపంలో నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్‌లో ఈ ప్రయోగాన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) ఏప్రిల్ 13న నిర్వహించింది. భవిష్యత్ ”స్టార్ వార్స్ టెక్నాలజీ”గా పిలుస్తున్న లేజర్ టెక్నాలజీ వెపన్స్‌ను తయారు చేసుకున్న అతి కొద్ది దేశాలలో భారత్ ఒకటిగా నిలిచింది. ”హైపవర్ టెక్నాలజీ వినియోగంలో ఇది ఆరంభం మాత్రమే” అని ప్రయోగం సక్సెస్ అయిన తర్వాత డీఆర్డీవో చైర్మన్ సమీర్ వి.కామత్ ప్రకటించారు. దీనిపై డీఆర్డీవో మాజీ ఛైర్మన్ జి.సతీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘భారత్ చేసిన ఈ ప్రయోగం రక్షణ రంగపరంగా ఎంతో కీలకమైంది’’ అన్నారు.

డ్రోన్ సాంకేతికతతో పెరుగుతున్న యుద్ధాలు
సాంకేతికత పెరుగుతున్న కొద్దీ యుద్ధరీతులు మారుతున్నాయి. మిసైల్స్ వినియోగానికి బదులుగా డ్రోన్ సాంకేతికతతో యుద్ధాలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్ -రష్యా యుద్ధంలో ఇప్పటికే డ్రోన్ దాడులు పెద్దసంఖ్యలో జరిగినట్లుగా స్పష్టమవుతోంది. భవిష్యత్తులో యుద్ధాల సమయంలో డ్రోన్ దాడులను అడ్డుకునేందుకు అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తెచ్చుకోవడం ప్రతి దేశానికి అవసరంగా మారింది. ఇందుకు హైపవర్ లేజర్, హైపర్ మైక్రోవేవ్ వంటి సాంకేతికతలను ఉపయోగించి ఆయుధాలు సమకూర్చుకోవడంపై ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ (డీఈడబ్య్లూ)ఎంకే -II(ఎ)ను డెవలప్ చేసింది డీఆర్డీవో. ప్రస్తుత తరుణంలో డ్రోన్ దాడులను సమర్థంగా ఎదుర్కోవాలంటే, యాంటీ డ్రోన్ వ్యవస్థలు సిద్ధం చేసుకోవడం ఎంతో ముఖ్యమని చెప్పారు సతీశ్ రెడ్డి. డీఆర్డీవో ప్రయోగించిన లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ ఎంతో శక్తిమంతమైనదని అన్నారు. భూమిపై నుంచి పనిచేసే లేజర్ డైరెక్టర్ ఎనర్జీ వెపన్‌ను డీఆర్డీవోలోని సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ (చెస్) ఆధ్వర్యంలో పరీక్షించారు. ఇందులో లేజర్ కిరణాలతో మానవ రహిత విమానాన్ని (యూఏవీ) కాల్చి వేసి… కూల్చివేసినట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియోను ‘ఎక్స్’ లో విడుదల చేసింది. భారత్‌కు ఉన్న స్టార్ వార్స్ సామర్థ్యాలలో ఇదొకటని డీఆర్డీవో చైర్మన్ సమీర్ వి.కామత్ ప్రకటించారు.
ఐదో స్థానంలో భారత్!
హైపవర్ లేజర్ డీఈడబ్ల్యూ సాంకేతికత కలిగిన దేశాల్లో భారత్ నాలుగు లేదా ఐదో స్థానంలో ఉంటుందని సమీర్ వి.కామత్ ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు. ”అమెరికా, రష్యా, చైనాల దగ్గర ఈ టెక్నాలజీ ఉంది. ఇజ్రాయెల్ కూడా అభివృద్ధి చేసుకుంటోంది” అని చెప్పారాయన. తేలికపాటి మానవ రహిత విమానాలనే కాకుండా డ్రోన్లు, హెలికాప్టర్లను కూడా పూర్తిగా డీఈడబ్ల్యూ సాయంతో కూల్చివేయవచ్చని డీఆర్డీవో ప్రకటించింది. 2019 నుంచి ‘లేజర్’ ప్రయోగాలు ఈ తరహా లేజర్ వెపన్ టెక్నాలజీని 2019లోనే అభివృద్ధి చేసింది డీఆర్డీవో. అయితే, అప్పట్లో రెండు కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ఛేదించేందుకు వినియోగించగా.. ప్రస్తుతం 30 కిలోవాట్ సామర్థ్యంతో కూడిన లేజర్ ఆయుధంతో 4-5 కిలోమీటర్ల రేంజ్ లక్ష్యాలను ఛేదించే వీలుంటుంది. ”ఈ లేజర్ సాంకేతికత డ్రోన్లను స్ట్రక్చురల్‌గా నాశనం చేయడంతో పాటు వాటిల్లోని సర్వైలెన్స్ సెన్సర్లను పనిచేయకుండా చేయగలదు.” అని డీఆర్డీవో ప్రకటించింది.
పెరిగిన లేజర్ టెక్నాలజీ వెపన్ సామర్థ్యం
మానవ రహిత విమానాలు, డ్రోన్లు నిర్దేశిత రేంజ్‌లోకి వచ్చాకే లేజర్ టెక్నాలజీ వెపన్స్ పనిచేస్తాయని డీఆర్డీవో ఆర్ అండ్ డీ మాజీ చీఫ్ కంట్రోలర్, నోయిడాలోని అమిటీ యూనివర్సిటీ చాన్స్‌లర్ డాక్టర్ డబ్ల్యూ.సెల్వమూర్తి చెప్పారు. ”డ్రోన్లు లేదా మానవ రహిత విమానాలు లక్ష్యాల వద్దకు వస్తున్న క్రమంలో భూమికి దగ్గర్లోకి రావాలి. అలా నిర్దేశిత రేంజ్‌లోకి వచ్చాక లేజర్ టెక్నాలజీ వాడి వాటిని కాల్చివేయవచ్చు.” అని చెప్పారాయన. దూరంగా ఉంటే లేజర్ కిరణాల ప్రభావం తక్కువగా ఉంటుందని వివరించారు. ప్రస్తుతం లేజర్ కిరణాలను చల్లబరిచే సాంకేతికతపై డీఆర్డీవోతో కలిసి అమిటీ యూనివర్సిటీ పనిచేస్తోంది. యాంటీ డ్రోన్ సిస్టమ్ అభివృద్ధి చేసిన దేశాల్లో భారత్ కూడా ఒకటిగా నిలిచిందని జి.సతీశ్ రెడ్డి చెప్పారు.
Read Also: బైడెన్ వల్లే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం – ట్రంప్