అమెరికా ఖండంలోనే అత్యంత పురాతన నాగరికతగా గుర్తింపు పొందిన కారల్ ప్రాంతానికి సమీపంగా మరో అద్భుత నగరం వెలుగు చూసింది. పెరూలో తాజాగా కనుగొన్న ‘పెనికో’ (Peniko City) అనే పురాతన నగరం ఇప్పుడు ప్రపంచ పురావస్తు శాస్త్రవేత్తల (Archaeologists) దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది కారల్ నాగరికతను మరింత లోతుగా అర్థం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.ఈ పురాతన నగరం కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు ఎనిమిదేళ్లు నిరంతరం పరిశోధనలు చేశారు. డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి శోధకులు నగరం మొత్తం గాలిలోంచి పర్యవేక్షించారు. ఫుటేజ్ ఆధారంగా వారు అక్కడ వృత్తాకార నిర్మాణం, మట్టి మరియు రాళ్లతో నిర్మించిన భవనాల అవశేషాలను గుర్తించారు.ఈ నగరంలో ఇప్పటివరకు 18 పురాతన నిర్మాణాలు బయటపడినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. వీటిలో ప్రార్థనా మందిరాలు, నివాస గృహాలు, ఇతర సామాజిక అవసరాలకు అనుగుణమైన కట్టడాలున్నాయని వెల్లడించారు. పెనికో నగరం ఒకప్పుడు పసిఫిక్ తీరప్రాంతం, అండీస్ పర్వతాలు, అమెజాన్ నదీ ప్రాంతాల మధ్య వాణిజ్య కేంద్రంగా ఉండి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

పురాతన వస్తువులతో కళాత్మక గాథలు
పెనికోలో జరిపిన తవ్వకాలలో ఉత్సవ వస్తువులు, మట్టితో చేసిన జంతువుల బొమ్మలు, పూసలు, గవ్వలతో చేసిన ఆభరణాలు బయటపడ్డాయి. వీటన్నీ అక్కడి ప్రజల జీవనశైలి, సామాజిక సంప్రదాయాల్ని వెల్లడిస్తున్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ వస్తువులు క్రీస్తు పూర్వం 3000 నాటి కారల్ నాగరికత స్థాయిని సూచిస్తున్నట్టు స్పష్టమవుతోంది.

కారల్‌కు సమీపంగా ఉండటం గమనార్హం
పెనికో నగరం కారల్ పిరమిడ్లు, నీటిపారుదల వ్యవస్థలు వంటి అద్భుత నిర్మాణాలకు సమీపంలోనే ఉండటంతో ఇది కారల్ నాగరికతలో భాగమే అయ్యుండవచ్చని అభిప్రాయపడుతున్నారు. కారల్ కథనం ఇప్పటికీ సవాళ్లతో నిండినది. కానీ పెనికో నగరం దాని అనుబంధంగా ఎంతో విలువైన సమాచారాన్ని అందించనుందన్న నమ్మకంతో పరిశోధకులు ముందుకు సాగుతున్నారు.
పెనికో ఆవిష్కరణ: అమెరికా చరిత్రకు కొత్త దారులు
ఈ వినూత్న ఆవిష్కరణ అమెరికా ఖండపు పురాతన చరిత్రపై కొత్త అధ్యాయాన్ని తెరిచే అవకాశం కల్పిస్తోంది. ఆసియా, మధ్యప్రాచ్యంలో నాగరికతలు వెలసిన దశలోనే పెనికో వంటి నగరం అమెరికాలో ఉండటం, అక్కడి ప్రజల అభివృద్ధిని చాటుతోంది.
Read Also : Elon Musk : ప్రకటనతో కుప్పకూలిన టెస్లా కంపెనీ షేర్లు