Imran Khan: ప్రతిష్ఠాత్మక ‘నోబెల్ శాంతి బహుమతి’ కి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నామినేట్ అయ్యారు. మానహ హక్కులు, ప్రజాస్వామ్యం కోసం చేసిన కృషికి గాను ఆయనకు ఈ నామినేషన్ లభించింది. నార్వేలోని రాజకీయ పార్టీ ‘పార్టియట్ సెంట్రం’ సభ్యులు.. పాకిస్థాన్ వరల్డ్ అలయెన్స్ అనే సంస్థతో కలిసి ఈ నామినేషన్ వేశారు. ఇమ్రాన్ ఖాన్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడం గర్వంగా ఉందని పార్టియట్ సెంట్రం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో తెలిపింది.

2019లోనూ నోబెల్ శాంతి బహుమతికి ఇమ్రాన్ నామినేట్
దక్షిణాసియాలో శాంతికి చేసిన కృషికి గాను 2019లోనూ నోబెల్ శాంతి బహుమతికి ఇమ్రాన్ నామినేట్ అ్యయారు. నార్వే నోబెల్ కమిటీకి ఏడా వేలాది నామినేషన్లు వస్తాయని, 8 నెలల సుదీర్ఘ ప్రక్రియ అనంతరం విజేతను కమిటీ ఎంపిక చేస్తుందని ”ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్” తెలిపింది. పాకిస్థాన్ ప్రధాన ప్రతిపక్షమైన పాకిస్థాన్ తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ వ్యవస్థాపకుడైన ఇమ్రాన్‌ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైలులో ఉన్నారు.
గత జనవరిలో ఇమ్రాన్‌కు 14 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు
అధికార దుర్వినియోగం, అవినీతి పాల్పడ్డారనే కేసులో గత జనవరిలో ఇమ్రాన్‌కు 14 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పువెలువడింది. ఇమ్రాన్‌పై పెట్టిన నాలుగో కేసు ఇది. ఈ కేసులో దోషిగా తీర్పువచ్చింది. దీనికి ముందు ఖాన్‌పై ప్రభుత్వ బహుమతులు అమ్ముకున్నారనే కేసు, రహస్యాలను లీక్ చేశారనే కేసు, అక్రమ వివాహం ఆరోపణల కేసు ఉండగా, ఈ మూడు కేసులు రద్దయ్యాయి. ఇమ్రాన్‌ఖాన్ 2022 ఏప్రిల్‌లో అవిశ్వాస ఓటుతో అధికారం కోల్పోయారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమని, రాజకీయ దురుద్దేశాలపై పెట్టినవేనని ఇమ్రాన్ ఖండించారు.