భారతదేశం ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానలు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తుంటే, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండుతున్నాయి. వాతావరణ శాఖ (IMD) తాజా హెచ్చరికల ప్రకారం, దక్షిణ భారతదేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.

దక్షిణ భారతదేశం: వర్షాలు, తుపాన్లు
దక్షిణ భారతదేశంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తుపాను ప్రభావం కనిపిస్తోంది. ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD వెల్లడించింది. అయితే, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కర్ణాటక, కేరళ, మాహే ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మధ్య మహారాష్ట్ర, విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనుండగా, అక్కడ వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఒడిశా, గోవా, కోస్తా కర్ణాటక, పశ్చిమ బెంగాల్, గుజరాత్ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.
ఉత్తర భారతదేశంలో పెరుగుతున్న ఎండలు
ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. ఢిల్లీలో ఇప్పటికే 39-40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని IMD వెల్లడించింది. రాబోయే రోజుల్లో ఇది 42 డిగ్రీల దాకా చేరుతుందని అంచనా రాజస్థాన్‌లో వడగాలులు వీస్తున్నాయి. ఏప్రిల్ 7 వరకు తీవ్ర గాలులు ఉంటాయని అంచనా గుజరాత్, మధ్యప్రదేశ్, విదర్భ, మరాఠ్వాడా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదయ్యే అవకాశం ఉంది. మధ్య భారతదేశంలో వాతావరణ పరిస్థితులు వేడిగా మారుతున్నాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకోనున్నాయి. ఒకవైపు వడగళ్ల వానలు, మరోవైపు ఉష్ణోగ్రత పెరుగుదల ఈ ప్రాంతాల్లో గణనీయంగా కనిపించనుంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా భారత్-మయన్మార్‌ను కలిపే జాతీయ రహదారి 113 తెగిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మధ్య మహారాష్ట్ర నుంచి కొమోరిన్ వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, తుఫానుల ప్రభావం కనిపించనుంది. ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు పెరగడానికి వాతావరణ మార్పులు ఒక ప్రధాన కారణంగా చెప్పొచ్చు. భారతదేశం అంతటా వాతావరణ పరిస్థితుల్లో విభిన్న మార్పులు కనిపిస్తున్నాయి. ఒక్క వైపు ఎండలు మండుతుంటే, మరోవైపు తుపానులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలి.