IIT Guwahati : అంతర్జాతీయ సరిహద్దుల భద్రత కోసం గువాహటి ఐఐటీ ఆధునిక రోబోలు భారతదేశం సరిహద్దు భద్రతను మరింత బలోపేతం చేసేందుకు గువాహటి ఐఐటీ పరిశోధకులు గణనీయమైన ముందడుగు వేశారు. సరిహద్దుల్లో నిఘా పెంచేందుకు అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో కొత్త రోబోలను అభివృద్ధి చేశారు. ఇప్పటికే భారత సైన్యం ఈ రోబోల ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించిందని అధికారులు తెలిపారు.సరిహద్దు భద్రతకు గానూ, గువాహటి ఐఐటీలోని డీఎస్‌ఆర్‌ఎల్ (DA Spatio Robotic Laboratory Pvt. Ltd) అనే స్టార్టప్ సంస్థ ఆధునిక రోబోలను రూపొందించింది. మానవీయ పెట్రోలింగ్‌కు భిన్నంగా, ఈ రోబోలు స్వయం ప్రతిపత్తితో పనిచేస్తాయి.

ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా సమర్థంగా స్పందించేలా వీటిని రూపొందించారు.డీఎస్‌ఆర్‌ఎల్ సీఈవో అర్నబ్ కుమార్ బర్మాన్ మాట్లాడుతూ, “ఈ రోబోలు నావిగేషన్, ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థలతో కూడి ఉంటాయి.వీటి ద్వారా సరిహద్దు రక్షణ మరింత బలపడుతుంది. అలాగే, మౌలిక సదుపాయాల భద్రతను కూడా పర్యవేక్షించడానికి వీటిని ఉపయోగించవచ్చు” అని వివరించారు.ఈ ఆధునిక రోబోలు, చొరబాట్లు లేదా అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించగల సెన్సార్ వ్యవస్థను కలిగి ఉంటాయి.
ముష్కరులు డ్రోన్ పంపినప్పటికీ, సరిహద్దుల్లో చొరబడేందుకు యత్నించినప్పటికీ, వీటి సెన్సార్లు వెంటనే స్పందించి భద్రతా బలగాలను అప్రమత్తం చేస్తాయి.ఈ రోబోల అభివృద్ధితో జాతీయ భద్రత వ్యవస్థ మరింత సమర్థంగా మారనుంది. భారత సైన్యం ఇప్పటికే వీటి పై రిపోర్ట్ తయారు చేస్తోంది. భవిష్యత్తులో సరిహద్దు రక్షణకు వీటిని పూర్తిస్థాయిలో వినియోగించే అవకాశముంది. భారతదేశ భద్రతను మరింత బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని డీఎస్‌ఆర్‌ఎల్ పరిశోధకులు చెబుతున్నారు. ఇటువంటి అత్యాధునిక టెక్నాలజీతో భద్రతా విభాగాలు మరింత సమర్థంగా పనిచేసే రోజులు దగ్గర్లోనే ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.