ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు (IFS) అధికారి జితేంద్ర రావత్ (42) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో సంచలనంగా మారింది. సెంట్రల్ ఢిల్లీలోని చాణక్యపురి ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. భవనంపై నుంచి దూకి ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన ఎలాంటి సూసైడ్ నోట్ లభించకపోవడంతో మరిన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్టు తెలుస్తోంది. అయితే జితేంద్ర రావత్ విదేశాంగ శాఖకు చెందిన రెసిడెన్షియల్ సొసైటీ నాలుగో అంతస్తులో తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నారు. ఆయన భార్యాపిల్లలు డెహ్రాడూన్ వెళ్లడంతో ఇంట్లో తల్లి ఒక్కరే ఉన్నారు. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో రావత్ భవనంపై నుంచి దూకినట్టు ప్రాథమిక సమాచారం. స్థానికులు ఆ శబ్దం విని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రావత్‌ను ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు.

ఆత్మహత్యకు కారణాలు ఏమిటి?
ప్రాథమిక దర్యాప్తులో రావత్ డిప్రెషన్‌తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఇది ఆత్మహత్యా ఘటనగానే భావిస్తున్నామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అయితే, ఆయన వద్ద సూసైడ్ నోట్ లభించకపోవడంతో మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. జితేంద్ర రావత్ మృతితో ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల మానసిక ఒత్తిడి గురించి చర్చ మొదలైంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీ పని ఒత్తిడి, వ్యక్తిగత సమస్యల కారణంగా అధిక సంఖ్యలో అధికారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు గత కొన్ని సంఘటనలు నిరూపిస్తున్నాయి. ఈ ఘటనపై విదేశాంగ శాఖ స్పందిస్తూ జితేంద్ర రావత్ మృతి తమ శాఖకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని పేర్కొంది. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామని, ఢిల్లీ పోలీసులతో విచారణలో సంప్రదింపులు కొనసాగిస్తున్నట్టు తెలిపింది. కుటుంబ గోప్యత దృష్ట్యా మరిన్ని వివరాలను వెల్లడించడానికి నిరాకరించింది. ఢిల్లీ చాణక్యపురిలో చోటుచేసుకున్న ఈ ఘటన మరోసారి అధికారుల మానసిక ఆరోగ్య పరిస్థితిని ప్రశ్నించేలా చేస్తోంది. పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నప్పటికీ, ఇది వ్యక్తిగత సమస్యల వల్ల జరిగినదా? లేక పనిబరువు కారణమా? అనే దానిపై సమాధానం రావాల్సి ఉంది.