అమరావతి: టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు గురువారం శాసనసభ లాబీల్లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. భవిష్యత్తులో పార్టీ అవకాశమిస్తే రాజ్యసభకు వెళతానని, లేకపోతే విశ్రాంత జీవితం గడుపుతానని రామకృష్ణుడు తెలిపారు. శాసనమండలి సభ్యుడిగా ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న తనను.. ఆ తర్వాత ఏం చేస్తారని అడుగుతున్న సన్నిహితులు, శ్రేయోభిలాషులకు ఇదే సమాధానం చెబుతున్నానని పేర్కొన్నారు.

ఇప్పుడు రాజకీయాలు ఖరీదైనవి
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించిన రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు తనతో ఫోన్‌లో మాట్లాడారని తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఫలానా వారిని ఎంపిక చేశామని ఆయన చెబితే… స్వాగతించానని చెప్పారు. తనకు రెండుసార్లు శాసనమండలి సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పానన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి సేవలందించానని తెలిపారు. ఇప్పుడు రాజకీయాలు ఖరీదైనవిగా మారిపోయాయని, ప్రజాస్వామ్యానికి ఇది మంచి పరిణామం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఓసారి రాజకీయాల్లోకి వస్తే ఇక వెనక్కి వెళ్లే మార్గం లేదు
కార్పొరేట్ల ప్రవేశంతో డబ్బున్న వారికే రాజకీయాలు అన్నట్లుగా ప్రపంచంలో మార్పు వచ్చిందని విమర్శించారు. 1983 సమయంలో ఎన్నికలకు డబ్బు ఖర్చు ఎందుకు, ఎన్టీఆర్ ప్రచారానికి వస్తే చాలు గెలిచిపోతాము అన్నట్టుగా ఉండేదన్నారు. రాజకీయాల్లోకి ఓసారి వస్తే ఇక వెనక్కి వెళ్లే మార్గం లేదని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. కాగా ఇటీవల ఏపీలో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి తరఫున అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.