Mamata Banerjee : ఇటీవల సుప్రీంకోర్టు పశ్చిమబెంగాల్‌లో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న 25,753 మంది టీచర్లు , ఇతర సిబ్బంది నియామకం చెల్లుబాటు కాదంటూ సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి స్పందించారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పు విని శోకంతో తన గుండె బండరాయిగా మారిందని అన్నారు. తాను ప్రాణాలతో ఉన్నంతవరకు అర్హులెవరు తమ ఉద్యోగాలు కోల్పోలేరని హామీ ఇచ్చారు.

నన్ను జైల్లో పెట్టే అవకాశం లేకపోలేదు
ఇటీవల అత్యున్నత న్యాయస్థానం టీచర్ల నియామకం అంశంలో ఇచ్చిన తీర్పు విని నా హృదయం శోక సంద్రమైంది. బండరాయిగా మారింది. ఆ తీర్పు ఆమోదయోగ్యంగా లేదు. ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను జైల్లో పెట్టే అవకాశం లేకపోలేదు. ఎవరైనా నాకు సవాల్ విసిరితే.. వారికి సమాధానం చెప్పగలను. అర్హులు ఉద్యోగాలు కోల్పోడాన్ని భరించలేను. నేను ప్రాణాలతో ఉన్నంతవరకు వారి ఉద్యోగాలను కాపాడతాను అని టీచర్లతో సమావేశమైన సందర్భంగా దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న 25,753 మంది టీచర్లు
రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న 25,753 మంది టీచర్లు, సిబ్బంది నియామక ప్రక్రియ యావత్తూ కళంకపూరితంగా, అక్రమాలతో కూడుకొని ఉందని సుప్రీంకోర్టు ఇటీవల అభిప్రాయపడింది. టీచర్లు, ఇతర సిబ్బంది నియామకాన్ని రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు గతేడాది ఏప్రిల్‌లో వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సమర్థించిన విషయం తెలిసిందే. భారీ స్థాయిలో మోసానికి పాల్పడ్డారంటూ ధర్మాసనం పేర్కొంది.
Read Also: భద్రాచలంలో ప్రారంభమైన శ్రీరామ పట్టాభిషేకం