Pawan Kalyan : బలవంతంగా ఏ భాషను రుద్దే ప్రయత్నాన్ని నేను వ్యతిరేకిస్తాను అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది సీట్లు తగ్గకూడదు, నేను అదే కోరుకుంటానని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి సభ్యుడిగా చెబుతున్నా దక్షిణాదికి సీట్లైతే కచ్చితంగా తగ్గవు అని చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజనపై ఎలాంటి ప్రకటన రానప్పుడు ముందస్తు నినాదాలు విభజనకు దారితీస్తాయని పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరగనపుడు ముందే రాద్ధాంతం చేయడం వల్ల ప్రయోజనం ఉండదు.

సినీ నటులు రాజకీయాల్లో గెలవడం అంత సులువు కాదు
నేను ఎప్పుడూ మాట మార్చలేదన్నారు. బలవంతంగా ఏ భాషను రుద్దే ప్రయత్నాన్ని నేను వ్యతిరేకిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. సినీ నటులు రాజకీయాల్లో గెలవడం అంత సులువు కాదు రాజకీయం అనేది అత్యంత కష్టమైన వ్యవహారం, ఇక్కడ అందరూ శత్రువులే అన్నారు. టీనేజ్‌లో ఉన్నప్పుడు జీవితం గురించి భయం కలిగిందని, దాని కోసం అన్వేషించగా ‘అచ్చమిల్లై అచ్చమిల్లై’ (భయంలేదు.. భయంలేదు) అనే భారతీయార్ కవిత కనిపించిందని, అవి ధైర్యం ఇచ్చిన పదాలని తెలిపారు. 2014లో పార్టీని ప్రారంభించినప్పుడు కనుచూపు మేర చీకటే కనిపించిందని, ఎలా ముందుకు వెళ్లాలో తెలియలేదని, మనసులో ఉన్న ధైర్యం తప్ప మరేమీ లేదని పేర్కొన్నారు.
హిందీని నేర్చుకుని తెలుగుకు తాను దూరంకాలేదు
త్రిభాషా విధానంలో హిందీనే నేర్చుకోవాలని ఎవరూ చెప్పలేదని, అందులో ఐచ్ఛికాలు ఉన్నాయన్నారు. తాను త్రిభాషా విధానంలో రూపొందినవాడినేనని, ఆంగ్లం, తెలుగు, హిందీ తెలుసన్నారు. ఇది తనకు లబ్ధి చేకూర్చిందన్నారు. హిందీని నేర్చుకుని తెలుగుకు తాను దూరంకాలేదని, ఇంకా దగ్గరయ్యానని తెలిపారు. ఎక్కడో ఉన్న బ్రిటిషువారి ఆంగ్లాన్ని నేర్చుకోవడానికి లేని భయం హిందీని నేర్చుకునేందుకు ఎందుకని ప్రశ్నించారు. ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు భాషలు హిందీతో కనుమరుగయ్యాయనే వాదనను ఆయన కొట్టిపారేశారు.