హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్ నగరంలోని పలు చెరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఖాజాగూడలోని కొత్తకుంట చెరువును సందర్శించి, చెరువు ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) పరిధిలో జరుగుతున్న అనధికారిక నిర్మాణాలను పరిశీలించారు. వంశీరామ్ బిల్డర్స్ చెరువు ఎఫ్‌టీఎల్‌ను మట్టితో నింపుతున్నారని గమనించి, తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మట్టిని వెంటనే తొలగించాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిర్మాణాలపై సీరియస్ అవుట్‌లుక్
కొత్తకుంట చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో అనుమతుల్లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కూడా హైడ్రాకు ఫిర్యాదు చేశారు. చెరువుల పరిరక్షణ కోసం సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని, ఎఫ్‌టీఎల్ పరిమితులను అర్థం చేసుకునేందుకు జాయింట్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించాలని సూచించారు.

ఇతర చెరువుల సందర్శన
కొత్తకుంట చెరువుతో పాటు మాదాపూర్‌లోని తమ్మిడికుంట, బోరబండ సమీపంలోని సున్నం చెరువును కూడా కమిషనర్ పరిశీలించారు. ఈ రెండు చెరువుల్లో కూడా పూడికతీత పనులు జరగాల్సిన అవసరం ఉందని గుర్తించి, వాటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువుల చుట్టూ పచ్చదనం పెంచడం, నీటి నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరచడం వంటి అంశాలను ప్రత్యేకంగా పరిశీలించారు.
చెరువుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
హైడ్రా ఈ ఏడాది మొత్తం ఆరు చెరువుల పునరుద్ధరణ, అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపట్టింది. ఇవన్నీ వచ్చే వర్షాకాలానికి పూర్తి కావాలని, పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. చెరువుల పరిరక్షణ, అభివృద్ధికి సంబంధించి చేపడుతున్న చర్యలను వేగవంతం చేయాలని, నిర్లక్ష్యం కనబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.