Telangana Bonalu : ఆషాఢమాసం వచ్చిందంటే చాలు లష్కర్లో బోనాల కోలాహలం మొదలవుతుంది. పోతురాజుల నృత్యాలు, జోగినుల పూనకాలు, డప్పుచప్పుళ్లు, తొట్టెల ఊరేగింపు, ఫలహారం బండ్ల ఊరేగింపుతో లష్కర్ జాతర జనజాతరలా మారుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. ఆషాఢ బోనం అంటే భోజనం అని అర్థం. ఇది అమ్మవారికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంలో పాలు, బెల్లం వేసి వండుతారు. కొంతమంది మహిళలు అన్నంలో పసుపు వేసి వండుతారు.
ఈ బోనాన్ని మట్టి లేదా ఇత్తడి/రాగి బిందెలకు పసుపు, కుంకుమ, సున్నంతో బొట్లు పెట్టి, వేప రెమ్మలతో అలంకరిస్తారు. దానిపైన ప్రమిద పెట్టి అందులో దీపం కూడా పెడతారు. పాలు, బెల్లం వేసి వండిన బోనంపైన ఒక చిన్న చెంబు పెట్టి అందులో పెరుగు, బెల్లం వేస్తారు. పసుపు అన్నం బోనంకు పైన చెంబులో పచ్చిపులుపు, ఉల్లిపాయలు వేస్తారు. ఇలా తయారు చేసిన బోనాలను మహిళలు తమ తలపై పెట్టుకుని డప్పు చప్పుళ్లతో అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తరువాత బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.

మహిళలు తలంటు పోసుకుని, ముఖానికి పసుపు రాసుకుని, చేతికి నిండుగా గాజులు వేసుకుని, సాంప్రదాయ వస్త్రాలు ధరించి వేపాకులతో అలంకరించిన బోనాలను నెత్తిన ఎత్తుకుని ఆనందంగా అమ్మవార్లకు సమర్పించేందుకు డప్పు చప్పుళ్లతో ఇంటి నుండి బయలుదేరి నృత్యాలు చేసుకుంటూ ఆలయానికి చేరుకుంటారు. వారి ముందు పోతురాజుల నృత్యంతో వారిని మరింత హుషారెత్తిస్తూ అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. లష్కర్లో బోనాల జాతర వచ్చిందంటే చాలు వీధులన్నీ ఎంతో కళకళలాడుతుంటాయి. పల్లెల్లో ఉన్న బంధువులు అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించేందుకు పట్నానికి చేరుకుని కుటుంబాలతో సహా అమ్మవారి ఆలయానికి వస్తారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అమ్మవారికి ‘సాక’ సమర్పించి బోనం నైవేద్యంగా సమర్పిస్తారు. ఆషాఢ సమయంలో మహాకాళీ దేవి తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వస్తుందనే పౌరాణిక కథనం ఉంది. ఈ సమయం దేవతకు బోనాలు సమర్పించడానికి అత్యంత అనుకూలమైన సమయం.
జంట నగరాల్లోని వివిధ ప్రాంతాల్లో బోనాల జాతరను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. నగరంలో ఆషాఢంలో మొదటి ఆదివారంనాడు గోల్కొండ కోటలోని జగదాంబ ఆలయంలో వేడుకలు జరుగుతాయి. రెండవ ఆదివారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, సికిందరాబాద్ శ్రీ ఉజ్జయినీ మహాకాళీ ఆలయం, రెజిమెంటల్ బజార్లోని గండి మైసమ్మ ఆలయం, మూడవ ఆదివారం చిలకలగూడాలోని పోచమ్మ, కట్టమైసమ్మ ఆలయం, పాత నగరంలోని లాల్ దర్వాజాలోని మాథేశ్వరి ఆలయం, హరిబౌలిలోని అక్కన్న మాదన్న ఆలయం, షాలీబండలోని ముత్యాలమ్మ ఆలయంతో పాటు జంట నగరాల పరిధిలోని అమ్మవారి ఆలయాల్లో బోనాలను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి యేటా లక్షలాది మంది భక్తులు అమ్మవారి ఆలయాల్లో జరిగే బోనాల వేడుకలకు తరలి వస్తుంటారు. బోనాలను తీసుకువచ్చే మహిళలలో అమ్మవారి ఆత్మ ఉంటుందని నమ్ముతారు. వారు తలపై బోనం ఎత్తుకుని బయలుదేరిన సమయంలో ఆత్మ దూకుడుగా ఉంటుందని, అందువల్ల బోనం ఎత్తుకున్నవారు ఇంటి నుంచి బయలుదేరిన దగ్గరి నుంచి ఆలయానికి వచ్చే వరకు వారి పాదాలపై భక్తులు నీళ్లు పోస్తుంటారు.
అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులు తాము ఆలయానికి చేరుకున్నట్లు అమ్మవారికి వెదురుబద్దెలతో తయారు చేసి, దానికి రంగు రంగుల కాగితాలను అతికించి అందంగా తయారు చేసి తొట్టెలను సమర్పిస్తారు. తొట్టెలను ఇంటి నుంచి ఆలయానికి తీసుకు వచ్చే సమయంలో డప్పు చప్పుళ్లతో బయలుదేరి నృత్యాలతో ఆడుతూ ఆలయానికి చేరుకుంటారు. పోతురాజు బోనాల జాతరంటే ముందుగా గుర్తుకు వచ్చేది పోతురాజులే. పురాణాల ప్రకారం పోతురాజు మాతృదేవతకు సోదరుడిగా పేర్కొంటారు. ఊరేగింపులో అతని పాత్ర చాలా బలంగా ఉంటుంది. పోతురాజు ఎర్రటి ధోతీ, కాళ్లకు గజ్జెల గంటలు ధరించి, శరీరంపై పసుపు పూసుకుని నుదుటిపై పెద్ద బొట్టు పెట్టుకుంటాడు. కళ్లకు నల్లని కాటుక ధరిస్తాడు. డప్పు అమ్మవారి దర్శనానికి రాలేనివాళ్ల కోసం ఒక్కోరోజు ఒక్కో ప్రాంతంలో ఘటాన్ని ఊరేగింపుగా తీసికెళ్తారు. భక్తులు అక్కడే ఘటానికి పూజలు నిర్వహించుకుని అమ్మవారికి మొక్కుకుంటారు.

జూన్ 29న అమ్మ వారి ఘటం మధ్యాహ్నం 2 గంటలకు ఆలయం నుంచి బయలుదేరి కర్బలా మైదానంలోని ఆలయం దగ్గర అలంకరణ పూర్తి చేసుకుని రాత్రి 10 గంటలకు దేవాలయానికి చేరుకున్నది. జూన్ 30న హిమాంభావి, డొక్కలమ్మ దేవాలయం, జులై 1న కళాసీగూడా, జులై 2న నల్లగుట్ట, జులై 3న పాన్ బజార్, జులై 4న ఓల్డ్ బోయిగూడా, జులై 5న రంగ్రేజీ బజార్, జులై 6న చిలకలగూడా, జులై 7న ఉప్పర్ బస్తీ, జులై 8న కుమ్మరిగూడా, జులై 9న రెజిమెంటల్ బజార్ ఏరియాలకు ఘటం ఊరేగింపుగా వెళ్లి ప్రతి రోజు రాత్రి 7 గంటలకు తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. 10న దేవాలయంలోనే ఉంటుంది. 11న బోయిగూడా చేరుకుని 12న తిరిగి వస్తుంది.

Telangana Bonalu జులై 13న బోనాలు సికిందరాబాద్ శ్రీ ఉజ్జయినీ మహాకాళీ అమ్మవారి ఆలయంలో అంగరంగ వైభవంగా జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రోత్సహిస్తున్నారు.ముఖ్యమంత్రి దంపతులు ఆలయానికి వచ్చి అమ్మవారికి సాక, బోనాలు సమర్పిస్తారు. ఆ రాత్రి ఫలహార బండ్ల ఊరేగింపు, పోతురాజుల విన్యాసాలు, రంగం (భవిష్యవాణి), సొరకాయ గుమ్మడికాయ బలితీయడం, అంబారీ ఊరేగింపు వంటి అనేక కార్యక్రమాలు జరుగుతాయి. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక డెకరేషన్లు, క్యూ లైన్లు, సేవల కోసం స్వచ్చంద సంస్థల సహాయంతో అన్నదానం, ఉచిత వైద్య శిబిరాలు, తాగునీటి పంపిణీ వంటి ఏర్పాట్లు ఉంటాయి. భద్రత కోసం సీసీ కెమెరాలు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ జాతర పూర్వం చరిత్రలో సికిందరాబాద్ బెటాలియన్‌లో పని చేసిన సురిటి అప్పయ్య, ఉజ్జయినీ మహాకాళీకి మొక్కుబడి చేసి 1815లో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తదనంతరం ఆయన కుటుంబ సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు ఆలయ అభివృద్ధిలో భాగమయ్యారు. ఆలయ పర్యవేక్షణ దేవాదాయ శాఖకు బదిలీ అయి, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణలో అత్యంత వైభవంగా బోనాల జాతరను నిర్వహిస్తున్నారు.(Telangana Bonalu)