చట్టసభల్లో ఓబీసీ (OBC) వర్గాలకు రాజకీయ రిజర్వేషన్లు సాధించుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలను సమన్వయపరుచుకుని దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య (R. Krishnaiah) పేర్కొన్నారు. ఢిల్లీలోని (Delhi) ఏపీ భవన్‌లో అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయస్థాయి ఓబీసీ సెమినార్‌లో ఆర్. కృష్ణయ్య ముఖ్యఅతిథిగా ప్రసంగించారు.
Read Also: TG 3rd Phase Elections : నేడు, రేపు స్కూళ్లకు సెలవు

కేంద్ర ప్రభుత్వం మహిళలకు రిజర్వేషన్ కల్పించేందుకు విధాన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, చట్టసభల్లో ఓబీసీలకు కూడా రిజర్వేషన్ కల్పించాలని దేశవ్యాప్తంగా ఒత్తిడి పెరుగుతుందని ఆయన అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు సహకరించి, దేశవ్యాప్త రిజర్వేషన్ కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) విధానాన్ని తీసుకోవాలని ఆయన కోరారు. కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటును సాధించి తీరుతామని కృష్ణయ్య హామీ ఇచ్చారు. అలాగే, స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలనే బీసీ సంఘాల డిమాండ్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్తానని కూడా ఆయన హామీ ఇచ్చారు.
బీసీల రాజకీయ చైతన్యం, ఇతర డిమాండ్‌లు
బీసీ వర్గాల్లో వచ్చినటువంటి రాజకీయ చైతన్యం దేశవ్యాప్తంగా మరో విప్లవానికి దారి తీయనుందని, దీనిని ప్రభుత్వాలు గుర్తించకపోతే బీసీ వర్గాల ప్రజలు తిరుగుబాటు చేస్తారని ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. చట్టసభల్లో రిజర్వేషన్ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడూ పార్లమెంట్‌లో ఓబీసీ వర్గాల సంక్షేమం, అభివృద్ధి, చట్టసభలలో రిజర్వేషన్ కల్పనపై మాట్లాడకపోవడం శోచనీయమని ఆయన విమర్శించారు. జాతీయ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకాన్ని దేశవ్యాప్తంగా ఓబీసీలలోని అన్ని కులాలకు వర్తింపజేసే విధంగా కేంద్ర మంత్రులతో చర్చిస్తానని ఆర్. కృష్ణయ్య పేర్కొన్నారు.
బీసీ నేతల ఐక్యతకు పిలుపు, ఏకగ్రీవ తీర్మానం
మాజీ రాజ్యసభ సభ్యులు వి. హనుమంతరావు మాట్లాడుతూ, పార్టీలు, జెండాలు పక్కనపెట్టి బీసీ డిమాండ్లు, చట్టసభల్లో రిజర్వేషన్ సాధన కోసం బీసీ ప్రజా ప్రతినిధులు, పార్టీల నేతలంతా ఒకే తాటి పైకి కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీల హక్కుల కోసం ఆర్. కృష్ణయ్య చేస్తున్న పోరాటాన్ని అన్ని రాజకీయ పార్టీలు బలపరుస్తున్నాయని, వారు మరింతగా బీసీ ఉద్యమాన్ని తీవ్రం చేయాలని పేర్కొన్నారు. ఈ జాతీయ స్థాయి సదస్సులో చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్, బీసీ కమిషన్ తెలంగాణ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహనరావు తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: