మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా కొందరు పెడచెవిన పెడుతున్నారు. తాజాగా, హైదరాబాద్ నగరంలోని చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి దారుణ ఘటనే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మత్తు కోసం ప్రయత్నించిన ఇద్దరు యువకులు, ఆ మత్తులోనే తమ నిండు ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఈ కేసు వివరాలను ఏసీపీ ఎ. సుధాకర్ మరియు సీఐ ఆర్. గోపి వెల్లడించారు.
Read Also: Hyderabad Challans: ట్రాఫిక్ చలాన్ల రాయితీ వార్తలు ఫేక్

రియాసత్‌నగర్‌లో ఆటో డ్రైవర్‌గా పనిచేసే ఇర్ఫాన్‌ఖాన్ (23), అతని స్నేహితుడు సైఫ్ బిన్ అక్రమ్ (21) మంగళవారం రాత్రి భోజనం చేశారు. ఆ తరువాత, వారు తమ ఆటోలో మరో ఇద్దరు స్నేహితులు – ఆటోడ్రైవర్ జహంగీర్‌ఖాన్, మరియు అతని స్నేహితుడు కల్యాణ్‌తో కలిసి బంగారు మైసమ్మ చౌరస్తా సమీపంలోని ఫారూఖ్-ఎ-ఆజం మసీదు ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్ వద్దకు చేరుకున్నారు. రాత్రి ఒంటిగంట దాటాక, జహంగీర్‌ఖాన్ తన వద్ద ఉన్న శస్త్ర చికిత్సల సమయంలో రోగులకు నొప్పి తెలియకుండా ఇచ్చే సూది మందును (ఇంజక్షన్) వారికి చూపించి, వేసుకుని విశ్రాంతి తీసుకుందామని కోరాడు.
మత్తులో కూలబడిన యువకులు: కేసు నమోదు
కాసేపటి తర్వాత జహంగీర్‌ఖాన్, ఇర్ఫాన్‌ఖాన్, సైఫ్ బిన్ అక్రమ్‌లు సూది మందును వేసుకున్నారు. బయట నిల్చుని ఉన్న సైఫ్ బిన్ అక్రమ్ వెంటనే అపస్మారక స్థితికి చేరి రోడ్డుపై పడిపోయాడు. ఆటో వెనుక సీటులో ఉన్న జహంగీర్‌ఖాన్, ఇర్ఫాన్‌ఖాన్‌లు కూలబడిపోయారు. దీనిని గమనించిన కల్యాణ్, జహంగీర్‌ఖాన్‌కు మంచినీళ్ల సీసా ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొంతసేపటికి తేరుకున్న సైఫ్ బిన్ అక్రమ్, ఆటోలో ఉన్న ఇద్దరినీ తట్టిలేపినా వారు స్పందించకపోవడంతో అతడు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఆటోలో ఇద్దరు విగతజీవులుగా ఉన్నట్టుగా గుర్తించిన స్థానికులు, బుధవారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఉస్మానియా ఆసుపత్రి (Osmania Hospital) మార్చురీకి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలం నుంచి సూదిమందు, మూడు సిరంజీలను స్వాధీనం చేసుకున్నారు. జహంగీర్‌ఖాన్ ముందుగానే పహాడీషరీఫ్‌లో గంజాయి తాగినట్లు గుర్తించారు. ప్రస్తుతం సైఫ్ బిన్ అక్రమ్, కల్యాణ్‌లను అదుపులోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జహంగీర్‌ఖాన్ సూది మందును ఎక్కడ కొనుగోలు చేశాడనే దానిపై విచారణ జరుగుతోంది.
తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వ చర్యలు
డ్రగ్స్, బెట్టింగ్‌ల వంటి వ్యసనాలకు బానిసలై ఎంతో మంది యువత తమ విలువైన జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు, వారి కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. కొన్ని క్షణాల ఆనందం కోసం ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. డ్రగ్స్‌కు అలవాటు పడిన మరికొంతమంది నేరాల బాట పడుతున్నారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ (HYD) నగరంలో డ్రగ్స్, (Drugs) గంజాయి కేసులు కలకలం రేపుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాలను వేళ్లతో సహా పెకిలించాలని నిశ్చయించింది. దీనికోసం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: