దేశంలో ఉద్యోగ వేతనాల విషయంలో ఓ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంలో బెంగళూరు, ముంబై, ఢిల్లీ లాంటి మెట్రో నగరాలే ఎక్కువ జీతాలకు చిరునామాగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ స్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా చెన్నై, హైదరాబాద్ (Hyderabad), అహ్మదాబాద్ లాంటి నగరాలు వేగంగా వేతన హాట్‌స్పాట్‌లుగా ఎదుగుతున్నాయి.ప్రముఖ జాబ్ పోర్టల్ ‘ఇండీడ్’ ఇటీవల విడుదల చేసిన ‘పేమ్యాప్ సర్వే’లో ఈ మార్పులు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా 1,300 పైచిలుకు కంపెనీలు, 2,500 మంది ఉద్యోగుల (Employees) అభిప్రాయాలతో ఈ సర్వే రూపొందించబడింది. కరోనా అనంతరం ఉద్యోగుల వేతనాలు ఎలా మారాయో అర్థం చేసుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం.

ఫ్రెషర్లకు చెన్నై బెస్ట్, అనుభవజ్ఞులకు హైదరాబాద్ టాప్
జీవితాన్ని కొత్తగా ప్రారంభిస్తున్న ఉద్యోగులకు చెన్నై మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది. అక్కడ ఫ్రెషర్లు సగటున నెలకు రూ.30,100 జీతం పొందుతున్నారు. మరోవైపు, అనుభవం కలిగిన ఉద్యోగులకు హైదరాబాద్ టాప్ గమ్యం. అక్కడ సీనియర్లకు నెలకు రూ.69,700 వరకూ జీతం లభిస్తోంది. దీంతో కెరీర్ అభివృద్ధి కోరే వారికి హైదరాబాద్ కేంద్రంగా మారుతోంది.గత ఏడాదిలో సగటు వేతనాల్లో 15 శాతం పెరుగుదల కనిపించినా, ఇది కేవలం పెద్ద నగరాలకే పరిమితం కాదు. జీవన వ్యయం తక్కువగా ఉండే నగరాల్లోను వేతనాలు మెరుగవుతున్నాయని ఇండీడ్ నివేదిక పేర్కొంది. ఇప్పుడిక ఉద్యోగులు జీతంతో పాటు జీవన నాణ్యతపై దృష్టి పెడుతున్నారు, అని ఇండీడ్ ఇండియా సేల్స్ హెడ్ శశి కుమార్ వెల్లడించారు.
మెట్రో నగరాల్లో అసంతృప్తి ఎక్కువే
సర్వేలో 69% మంది ఉద్యోగులు తాము నివసించే నగరాల్లో తమ వేతనంతో జీవించలేకపోతున్నామని తెలిపారు. ఢిల్లీ, ముంబై, పుణె, బెంగళూరులో ఈ అసంతృప్తి ఎక్కువగా ఉంది. ఇందుకు వ్యతిరేకంగా చెన్నై, అహ్మదాబాద్, హైదరాబాద్ వంటి నగరాల్లో జీవన ఖర్చులు తక్కువగా ఉండటంతో కొంత ఊపిరి పెట్టుకుంటున్నారని సర్వే చెబుతోంది.
ఐటీ రంగంలో జీతాల జోరు
రంగాల వారీగా చూస్తే, ఐటీ రంగమే అన్ని స్థాయిల ఉద్యోగులకు అధిక జీతాలు ఇచ్చే రంగంగా నిలిచింది. డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి నైపుణ్యాలకు పెరిగిన డిమాండ్ ఇందుకు కారణం. సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, హెచ్‌ఆర్ ఇంజినీర్లు మొదలుకొని ఫ్రెషర్లు సైతం రూ.25,000 నుంచి రూ.30,500 మధ్య జీతం పొందుతున్నారు.ఉద్యోగ మార్కెట్ స్పష్టంగా మారుతోంది. జీతాల పరంగా పెద్ద నగరాల ఆధిపత్యం తగ్గిపోతోంది. జీవిత నాణ్యత, తక్కువ ఖర్చులు ఉన్న నగరాల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. ఇది భవిష్యత్ ఉద్యోగుల దిశను పూర్తిగా మార్చే అవకాశముంది.
Read Also : Rain: తెలంగాణకు రెయిన్ అలర్ట్..పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ