hyderabad : తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తాం: స్మితా సబర్వాల్ మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ ప్రత్యేకతను ప్రతిబింబించేలా నిర్వహిస్తామని పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ తెలిపారు. మే నెలలో జరగనున్న ఈ అంతర్జాతీయ అందాల పోటీల ద్వారా తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటనున్నట్లు ఆమె వివరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ త్రిలింగ దేశంగా ప్రాచీనకాలం నుంచి ప్రాముఖ్యతను కలిగి ఉందన్నారు.ఈ భూభాగానికి 2,500 ఏళ్ల విశిష్ట చరిత్ర ఉందని, అనేక గొప్ప కట్టడాలు, సంప్రదాయాలు రాష్ట్రపు గౌరవాన్ని పెంచాయని తెలిపారు.

పర్యాటక ఆకర్షణలు తెలంగాణ వైభవం
రామప్ప దేవాలయం, వేయి స్తంభాల గుడి, చార్మినార్, గోల్కొండ కోట వంటి పురాతన నిర్మాణాలు రాష్ట్రం సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనమని ఆమె వివరించారు.తెలంగాణ మెడికల్ టూరిజంలో కూడా అత్యున్నత స్థాయిలో ఉన్నదని, దేశం నలుమూలల నుంచి ప్రజలు వైద్యసేవల కోసం ఇక్కడకు వస్తున్నారని గుర్తు చేశారు.

సినిమా ఆహార రంగాల్లో తెలంగాణ ప్రాముఖ్యత
తెలంగాణ అనేక రంగాల్లో విశేష అభివృద్ధిని సాధించిందని, ప్రత్యేకించి సినిమా,ఆహార పరిశ్రమల్లో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిందని స్మితా సబర్వాల్ తెలిపారు.రాష్ట్ర ఏర్పడిన 11 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని,మిస్ వరల్డ్ పోటీలు నిర్వహణ ద్వారా తెలంగాణకు అంతర్జాతీయ వేదికపై మరింత గుర్తింపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణలో మిస్ వరల్డ్ – అద్భుతమైన వేదిక
72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణలో జరగబోతున్నాయి. మే 7 నుంచి మే 31 వరకు నిర్వహించనున్న ఈ పోటీల్లో దాదాపు 140 దేశాల నుంచి కంటెస్టెంట్లు పాల్గొననున్నారు. వీటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా సంస్థలు, ప్రముఖులు హాజరుకానున్నారు. మొత్తం 10 ప్రాంతాల్లో ఈ పోటీలు జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా, హైదరాబాద్‌లో ప్రారంభ, ముగింపు వేడుకలు జరుగుతాయి.ఈవెంట్ కోసం హైదరాబాద్‌లోని హైటెక్స్, శిల్పారామం, గచ్చిబౌలి స్టేడియాలను పరిశీలిస్తున్నారు. ఇతర కార్యక్రమాలు పోచంపల్లి, యాదగిరిగుట్ట, రామప్ప, లక్నవరం, నాగార్జునసాగర్, వికారాబాద్ వంటి ప్రాంతాల్లో జరపనున్నారు. ఈ పోటీల వల్ల తెలంగాణ ప్రత్యేకమైన గుర్తింపు పొందనుందని అధికారులు చెబుతున్నారు