IT HUB : భారతదేశ ఐటీ రాజధాని, సిలికాన్ సిటీగా పేరుగాంచిన బెంగళూరుకు ఇప్పుడు తెలంగాణ రాజధాని హైదరాబాద్ సవాల్ విసురుతోంది. ఇప్పటివరకు టెక్నాలజీ రంగంలో ఎక్కువ ఉద్యోగాలు బెంగళూరుకే పరిమితమయ్యాయి. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు వేగంగా (IT HUB) మారుతున్నాయి. హైదరాబాద్ ఐటీ పరిశ్రమలో వేగంగా అభివృద్ధి చెందుతూ, బెంగళూరుతో పోటీ పడే కొత్త హబ్‌గా ఎదుగుతోంది.
ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఇప్పుడు సీనియర్ ఇంజనీర్లు, కొత్త బృందాల కోసం బెంగళూరుకు బదులుగా హైదరాబాద్‌ను ఎక్కువగా ఎంపిక చేస్తున్నాయి. గతంలో హైదరాబాద్‌ను ఎక్కువగా బ్యాక్-ఆఫీస్, కాల్ సెంటర్, ప్రాథమిక ఐటీ సేవల కేంద్రంగా మాత్రమే పరిగణించేవారు. కానీ ఇప్పుడు డేటా ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), పరిశోధన & అభివృద్ధి (R&D) వంటి అధునాతన రంగాల్లో కూడా హైదరాబాద్ ప్రత్యేక ఆకర్షణగా మారింది.
తక్కువ ఆపరేటింగ్ ఖర్చులు, వ్యూహాత్మకంగా అభివృద్ధి చేసిన IT పార్కులు, స్టార్టప్ కల్చర్, పరిశోధనా కేంద్రాల పెరుగుదల కలిసి హైదరాబాద్ ఐటీ ఎకోసిస్టమ్‌ను మరింత బలపరుస్తున్నాయి. దీనివల్ల కంపెనీలు బెంగళూరు నుండి ఎక్కువ సీనియర్ స్థాయి ఉద్యోగులను హైదరాబాద్‌కు తరలిస్తున్నాయి. జీతాల తేడా కూడా తగ్గిపోవడంతో, కొన్ని సందర్భాల్లో హైదరాబాద్ జీతాలు బెంగళూరుతో సమానంగా లేదా ఎక్కువగా కూడా ఉండటం గమనార్హం.
స్టాఫింగ్ నిపుణుల ప్రకారం, ఇది యువ టెక్ నిపుణులు, సీనియర్ ఇంజనీర్లకు మంచి అవకాశం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, బిగ్ డేటా వంటి రంగాల్లో నైపుణ్యం కలిగిన ఉద్యోగుల డిమాండ్ పెరగడంతో హైదరాబాద్ భవిష్యత్తులో భారతదేశపు ప్రధాన ఐటీ హబ్‌గా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
గోపన్‌పల్లిలో కొత్త భారీ ఐటీ పార్క్ ప్రణాళిక
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో మరో భారీ ఐటీ పార్క్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను గోపన్‌పల్లి తండా పరిసరాల్లో, అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం సమీపంలో నిర్మించనున్నారు. ఈ పార్క్ కోసం ప్రభుత్వం, ప్రైవేట్ రంగంలో ఉన్న దాదాపు 439 ఎకరాల భూములను గుర్తించింది.
ప్రాజెక్ట్ స్థలం అమెరికన్ కాన్సులేట్, గోపన్‌పల్లి ఫ్లైఓవర్, విప్రో క్యాంపస్, తెల్లాపూర్ ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉండటంతో ఇక్కడ కనెక్టివిటీ, వసతులు సులభంగా లభిస్తాయి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సర్వే నంబర్లు, భూముల సరిహద్దులు, మ్యాపులతో కూడిన నివేదిక కూడా సిద్ధమైంది.
ఇప్పటికే గోపన్‌పల్లి, వట్టినాగులపల్లి ప్రాంతాల్లో ఐటీ సంస్థల కార్యకలాపాలు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా అమెరికన్ కాన్సులేట్ ప్రారంభం కావడంతో ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యం వచ్చింది. గచ్చిబౌలి, గోపన్‌పల్లి ప్రాంతాల్లో ఇప్పటికే రెండు ఐటీ పార్కులు అభివృద్ధి అవుతుండటంతో, కొత్త ఐటీ పార్క్ మరింతగా ఈ ప్రాంతాన్ని ఐటీ హబ్‌గా నిలబెట్టనుంది.
ప్రాజెక్ట్ విజయవంతం కావడానికి ప్రభుత్వ, ప్రైవేట్ భూముల సమీకరణం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్, రవాణా కనెక్టివిటీ కీలకం కానున్నాయి. గోపన్‌పల్లి-తెల్లాపూర్ ఔటర్ రింగ్ రోడ్, గోపన్‌పల్లి ఫ్లైఓవర్ వంటి ప్రధాన మార్గాలు ఈ కొత్త ఐటీ హబ్ అభివృద్ధికి మరింత అనుకూలం కానున్నాయి.
Read also :