హైదరాబాద్‌లో నిర్వహించే మిస్ వరల్డ్ పోటీలను రాష్ట్ర పర్యాటకం, సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ అభివృద్దికి వేదికగా మలుచుకుంటామని పర్యాటక శాఖ వెల్లడించింది.2025 మే 7 నుంచి మే 31 వరకు హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రదేశాల్లో ఈ అంతర్జాతీయ అందాల పోటీలు జరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల నుండి అందాల భామలు, 3,000 మంది మీడియా ప్రతినిధులు ఈ ఈవెంట్ కోసం హాజరవుతున్నారు. ఈ పోటీల ద్వారా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఆర్థిక రంగాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది.
తెలంగాణలో 10 వేదికలు
మొత్తం 10 వేదికల్లో మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించనున్నారు. ప్రారంభ, ముగింపు ఈవెంట్లు హైదరాబాద్ లో ఖరారైనట్లు తెలుస్తోంది. దీని కోసం హైటెక్స్, శిల్పారామాన్ని, గచ్చిబౌలి స్టేడియాన్ని పరిశీలిస్తున్నారు. మిగిలిన వేదికల కోసం రూరల్ తెలంగాణ ప్రమోషన్ లో భాగంగా పోచంపల్లి, యాదగిరిగుట్ట, రామప్ప, లక్నవరం, నాగార్జున సాగర్, వికారాబాద్ వంటి ప్రాంతాలను లిస్ట్ లో చేర్చారు. తద్వారా ఆయా ప్రాంతాల బ్రాండ్ ప్రమోషన్ పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు పోచంపల్లి, నాగార్జున సాగర్ లోని బుద్ధవనం ఖరారైనట్లు సమాచారం.
72వ మిస్ వరల్డ్ పోటీలు
ప్రస్తుత 72వ మిస్ వరల్డ్ అందాల పోటీలను కేవలం సౌందర్యానికి మాత్రమే పరిమితం కాకుండా.. సాంస్కృతిక, పర్యాటక సొబగులు అద్దనున్నట్లు సాంస్కృతిక శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణను ప్రపంచ పర్యాటక తెరపైకి తెచ్చేందుకు పర్యాటక, సాంస్కృతిక శాఖలు కసరత్తు చేస్తున్నాయి. వివిధ దేశాల అందాల భామలను ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లడం ద్వారా అంతర్జాతీయంగా ప్రాచుర్యం లభించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
పోచంపల్లిలోఈవెంట్
పోచంపల్లిలో ఈవెంట్ పోచంపల్లిలో ఒక ఈవెంట్ ను రూపొందించారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే సుందరీమణులు పోచంపల్లికి వెళ్లి చేనేత కార్మికులతో మాటామంతి జరపనున్నారు. చేనేత వస్త్రాల తయారీని అందాల భామలు పరిశీలిస్తారు. అనంతరం పోచంపల్లి చీరలను ధరించి ర్యాంప్ వాక్ చేసేలా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయంగా మరింత పేరును తీసుకురావడమే లక్ష్యంగా సాంస్కృతిక శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
బుద్ధవనం ప్రాజెక్ట్
ప్రపంచంలోని బౌద్ధులను ఆకర్షించేందుకు నాగార్జున సాగర్ లోని బుద్ధవనాన్ని ఎంపిక చేశారు. కృష్ణానది ఒడ్డున నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టును అందాల పోటీల్లో పాల్గొనే వారంతా సందర్శించేలా ప్రణాళికను రూపొందించారు. మిస్ వరల్డ్ పోటీల్లో తెలంగాణలోని వివిధ ప్రాంతాల విశిష్టతలతో వీడియోలను కూడా రూపొందిస్తున్నారు. ఇవన్నీ తెలంగాణ పర్యాటకానికి మరింత గుర్తింపు లభించేలా దోహదపడనున్నాయి.తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీలను పర్యాటకులకు, పెట్టుబడులకు ఆకర్షణగా మారుస్తోంది. రాష్ట్రంలోని వారసత్వ సంపద, భద్రత, మౌలిక సదుపాయాలను ప్రదర్శించనుంది. తెలంగాణలోని చేనేత రంగం, జానపదనృత్యాలు, సంగీతం, వంటకాలు ప్రముఖంగా ప్రదర్శించబడతాయి. కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లు, జోడేఘాట్ వ్యాలీ, ఇతర పర్యావరణ పర్యాటక గమ్యస్థానాలు ప్రదర్శించబడతాయి.