వేసవి సెలవులు ప్రారంభమయ్యే వేళ పుణ్యక్షేత్రాల సందర్శనకు భక్తులు, పర్యాటకులు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు ఇది ఒక మంచి అవకాశం. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. పెరిగిన రద్దీ దృష్ట్యా విశేష రైల్వే ఏర్పాట్లు చేపట్టింది. ఏప్రిల్, మే నెలల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.

ప్రత్యేక రైళ్ల ఏర్పాట్లు
వేసవి సెలవుల్లో అనేక మంది కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లే ఆలోచనలో ఉంటారు. ఇక స్కూల్ సెలవులు, ఉద్యోగ సెలవులు కలిసి వచ్చేటప్పుడు భక్తుల రద్దీ అమాంతం పెరుగుతుంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక చర్యలు తీసుకుంది. మొత్తం 32 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.
స్పెషల్ ట్రైన్ వివరాలు
చర్లపల్లి–తిరుపతి (07017)– ఈ ప్రత్యేక రైలు చర్లపల్లి నుంచి ప్రారంభమవుతుంది. ప్రతి శుక్రవారం, ఆదివారం రోజుల్లో ట్రైన్ నడుస్తుంది. ఉదయం 9:35 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరుతుంది. ముఖ్యమైన స్టేషన్లు మల్కాజిగిరి, కాచిగూడ, మహబూబ్‌నగర్, జడ్చర్ల, డోన్, కడప, రేణిగుంట స్టేషన్లో ఆగుతూ వెళ్తుంది.
తిరుపతి–చర్లపల్లి (07018)– తిరుపతి నుంచి శనివారం, సోమవారం రోజుల్లో తిరుగు ప్రయాణం చేస్తుంది. సాయంత్రం 4:40 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. ఈ రైళ్లు మే 23వ తేదీ వరకు వారానికి రెండు సార్లు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు ప్రకటించారు. అంటే ప్రయాణికులకు ఏకంగా 64 సర్వీసులు అందుబాటులో ఉంటాయని అర్థం. ఈ వేసవి సెలవుల్లో శ్రీవారి దర్శనం చేయాలని అనుకుంటున్నవారు, ఇప్పుడే మీ టికెట్లు బుక్ చేసుకోండి. రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో ప్రయాణించండి. దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం చాలామందికి ఉపశమనం కలిగిస్తుందని ఆశించవచ్చు.
Read also: Bomb Blasts Case : దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసు..నేడు హైకోర్టు తీర్పు