అమెరికాలో (In America) భారతీయ విద్యార్థిపై జరిగిన దారుణ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. న్యూజెర్సీ నెవార్క్ అంతర్జాతీయ విమానాశ్రయంలో, జూన్ 7న ఓ భారత విద్యార్థిని (Indian student) అధికారులే అమానుషంగా వ్యవహరించిన దృశ్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎలాంటి నేరం చేయకుండా, కేవలం విద్య కోసం అమెరికా వెళ్లిన యువకుడిని నేరస్థుడిలా చూశారు. ఈ దురదృష్టకర సంఘటనను ఓ భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త కునాల్ జైన్ తన ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్గా మారింది.వీడియోలో విద్యార్థిని భయాందోళనతో ఆర్తనాదాలు చేస్తూ కనిపించారు. చేతులకు బేడీలు వేసి, నేలపై పడేసి, ఎలాంటి మానవీయత చూపకుండా అధికారులు బలవంతంగా వెనక్కి పంపారు. ఈ దృశ్యాన్ని చూసినవారంతా తీవ్రంగా స్పందిస్తున్నారు. విద్యార్థి పరిస్థితిని చూసి మనసు కలవరపడుతోందని, ఇలాంటి మానవతా రహిత వ్యవహారం అసహ్యంగా ఉందని కునాల్ జైన్ తెలిపారు.
“గుండె పగిలినంత పని అయ్యింది” – కునాల్ స్పందన
ఈ ఘటనపై జైన్ తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో స్పందిస్తూ, “ఆ యువకుడు నేరస్థుడిలా ప్రవర్తించారు. కానీ అతను తన కలల కోసం అమెరికా వచ్చాడు. నన్ను మౌనంగా చూస్తూ ఉండిపోయేలా చేశారు. నా గుండె పగిలిపోయినట్లు అనిపించింది” అని వేదన వ్యక్తం చేశారు. విద్యార్థి మాట్లాడుతున్న పద్ధతి చూస్తే హర్యానా ప్రాంతానికి చెందినవాడిగా అనిపించిందని తెలిపారు.ఈ ఘటనలో విద్యార్థి సరైన డాక్యుమెంట్లు చూపినా, అధికారులకు తన ప్రయోజనాన్ని సరిగ్గా వివరించలేకపోయాడని అంచనా. ఇటీవలి కాలంలో అనేక మంది భారతీయ విద్యార్థులు ఇమ్మిగ్రేషన్ సమయంలో సరైన సమాచారం ఇవ్వలేక తిరస్కరణ ఎదుర్కొంటున్నారు. ఇదే కారణంగా సరైన వీసా, టిక్కెట్ ఉన్నప్పటికీ, విద్యార్థులను విమానాశ్రయాల వద్దే నిలిపి, దేశానికి పంపిస్తున్నారు.
భారత దౌత్యం స్పందించాలంటూ విజ్ఞప్తి
ఈ ఘటనపై కునాల్ జైన్ అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ను ట్యాగ్ చేస్తూ స్పందించమని విజ్ఞప్తి చేశారు. బాధిత విద్యార్థికి న్యాయం జరిగేలా చూడాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
సోషల్ మీడియాలో ఆగ్రహావేశం
ఈ వీడియో వైరల్ కావడంతో భారతీయుల భద్రతపై ఆందోళనలు మొదలయ్యాయి. నెటిజన్లు అమెరికాలోని ఇమ్మిగ్రేషన్ వ్యవస్థపై తీవ్రంగా మండిపడుతున్నారు. భారత ప్రభుత్వం తక్షణమే స్పందించి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం విద్యార్థి తప్పులు చేయి ఉండవచ్చని, అతను సరైన సమాధానాలు ఇవ్వలేదేమోనన్న వాదనలూ వినిపిస్తున్నాయి.ఏ కారణం ఉన్నా, విద్యార్థిపై ఇలా ప్రవర్తించడాన్ని సమర్థించలేమని పలువురు అంటున్నారు. ఈ ఘటనపై అధికారిక దర్యాప్తు జరిపి పూర్తి సమాచారం వెలికి తీయాల్సిన అవసరం ఉంది. యువత కలలు నెరవేర్చేందుకు వెళ్లిన చోటే ఇలాంటి అవమానాలు ఎదుర్కోవడం బాధాకరం.