నాగచైతన్య – సాయిపల్లవి నటించిన సినిమా ఇది. బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాకి చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు కనిపిస్తున్నాయి. అలా కనిపించడానికి గల కారణాలు కూడా బలంగానే ఉన్నాయి.’కార్తికేయ 2′ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత చందూ మొండేటి దర్శకత్వం వహించిన సినిమా ఇది. లవ్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ ను తన కథలో కలపడంలో చందూ మొండేటికి మంచి నైపుణ్యం ఉంది. ఆయన గత చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఉంటాయి. ఇక చైతూ – సాయి పల్లవి గతంలో చేసిన ‘లవ్ స్టోరీ’ యూత్ కు ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. చైతూ కెరియర్లోనే ఈ సినిమా పెద్ద హిట్ గా నిలిచింది. అందువలన సహజంగానే ఈ కాంబినేషన్ పై కుతూహలం పెరుగుతోంది.

ఇక తెలుగులో సాయిపల్లవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ‘విరాట పర్వం’ తరువాత సాయిపల్లవి నుంచి మరో తెలుగు సినిమా రాలేదు. కొంత గ్యాప్ తరువాత సాయిపల్లవి చేసిన సినిమా ఇది. ఆమె నటన .. డాన్స్ ను తెరపై చూడటానికి అభిమానులు ఉత్సాహంతో ఉన్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. బుజ్జితల్లి .. హైలెస్స .. నమః శివాయ .. పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కథాకథనాల పరంగానే కాదు, సంగీతం పరంగా కూడా ఈ సినిమా జెండా ఎగరేయడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది.