భారతదేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నా, పరువు కోసం జరుగుతున్న హత్యలు ఇంకా సమాజాన్ని కలవరపెడుతున్నాయి. కుటుంబ పరువు, సంప్రదాయాల పేరుతో తల్లిదండ్రులే తమ పిల్లల ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో జరిగిన అలాంటి విషాదకరమైన సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. కసాపురం సమీపంలో ఓ తండ్రి తన కూతురిని హత్య చేసి, ఆ తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయిన ఘటన చర్చనీయాంశంగా మారింది.
తండ్రి కూతురి పెళ్లికి అంగీకరించలేదు
పోలీసుల కథనం ప్రకారం, గుంతకల్లు పట్టణానికి చెందిన ఒక దంపతులకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. ముగ్గురు కుమార్తెలను వివాహం చేయగా, చిన్న కుమార్తె బీటెక్ చదువుకుంటూ ఉన్నది. తల్లిదండ్రులు ఆమెను కూడా వివాహం చేసి తమ బాధ్యత ముగించుకోవాలని అనుకున్నారు. అయితే, ఆ యువతి ఓ యువకుణ్ని ప్రేమించానని, అతడినే పెళ్లి చేసుకుంటానని తండ్రికి చెప్పింది. అయితే, ఆ యువకుడు వేరే కులానికి చెందినవాడై ఉండటంతో తండ్రి కూతురి పెళ్లికి అంగీకరించలేదు. కుమార్తె తన నిర్ణయాన్ని మార్చుకోలేదనే కారణంతో, పరువు పోతుందనే భయంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.

మృతదేహాన్ని పెట్రోల్ పోసి
తండ్రి మంగళవారం సాయంత్రం తన కూతురిని కసాపురం శివార్లలోని తిక్క స్వామి ఆలయానికి తీసుకెళ్లి ఉరివేసి హత్య చేశాడు. ఆపై మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టాడు. అయితే, తన కూతుర్ని హత్య చేసిన తరువాత, పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన మరోసారి పరువు కోసం తీసుకునే అమానుష నిర్ణయాలను, సమాజంలో ఇంకా మారాల్సిన ఆలోచన విధానాలను ప్రతిబింబిస్తోంది.