విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్లాంట్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తున్న యాజమాన్య నిర్ణయానికి నిరసనగా కార్మిక సంఘాలు స్పందించాయి. ఈ నెల 16వ తేదీ నుండి సమ్మెకు దిగనున్నట్టు కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ప్లాంట్ యాజమాన్యం అప్రమత్తమైంది.
కార్మిక సంఘాల సమ్మె
కార్మిక సంఘాల సమ్మె నేపథ్యంలో కంపెనీ యాజమాన్యం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఏవైనా అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నెల 15 నుంచి 30వ తేదీ వరకు అన్ని సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కాలంలో ఉద్యోగులు, ఇతర సిబ్బంది అందరూ విధులకు హాజరుకావాలని కఠిన ఆదేశాలు జారీ చేసింది.

కార్మికుల తొలగింపు నిర్ణయం
విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్య ఇప్పటికే తీవ్రతరంగా మారిన విషయం తెలిసిందే. కార్మికుల తొలగింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యూనియన్లు చేపట్టనున్న సమ్మెపై రాష్ట్రవ్యాప్తంగా దృష్టి సారిస్తోంది. యాజమాన్యం తీసుకున్న తాజా నిర్ణయానికి కార్మిక సంఘాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.