అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన రోజునుంచి ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తున్నారు. ఆర్థికరంగాల్లో ఎన్నో మార్పులకు స్వీకారం చుడుతున్నారు. తాజాగా ఆయన తీసుకుంటున్న దూకుడైన చర్యలు.. ఇలా రూపాయి విలువ పడేందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. రూపాయి విలువ మరింత క్షీణించింది. ఇటీవలి కాలంలో రోజురోజుకూ పతనం అవుతూ వస్తున్న రూపాయి మారకం విలువ ఫిబ్రవరి 3న ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది. అమెరికా.. తన ప్రధాన వాణిజ్య భాగస్వాములైన కెనడా, మెక్సికో, చైనా వంటి దేశాలపై సుంకాల విధింపుతో డాలర్ బలపడుతోంది. ఇదే సమయంలో డాలర్‌పైనే ఎక్కువగా ఆధారపడి ఉన్న ఆసియా కరెన్సీలో పతనం అవుతున్నాయి.
కిందటి సెషన్లో రూపాయి విలువ రూ. 86.60 స్థాయిలో ఉండేది. ఇవాళ ఒక్కసారిగా 0.70 శాతం పతనంతో రికార్డు స్థాయి కనిష్టాలకు పడిపోయింది. ఇదే సమయంలో డాలర్ ఇండెక్స్ 0.30 శాతం పెరిగి 109.8 వద్ద కొనసాగుతోంది. చైనీస్ యువాన్ కూడా 0.50 శాతం తగ్గింది.

ఇదే సమయంలో అంతర్జాతీయ అనిశ్చితి నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు పెరిగిపోతున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ 0.73 శాతం పెరిగి బ్యారెల్‌పై 76.22 డాలర్ల వద్ద ఉంది. ఇలా దిగుమతి బిల్లు భారమై దేశానికి ఆర్థిక లోటు తీవ్రమవుతోంది. ఇంకా భారత స్టాక్ మార్కెట్ సూచీలు కూడా సోమవారం సెషన్లో తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 700 పాయింట్లు, నిఫ్టీ 250 పాయింట్లకుపైగా పతనమైంది. ఇలా అంతర్జాతీయ అనిశ్చితి సహా క్రూడాయిల్ ధరలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ప్రకటనలు ఇలా ఇదంతా మన కరెన్సీపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక రూపాయి పతనం వివిధ రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుంటుంది. నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. అంటే ముందుగా ద్రవ్యోల్బణం పెరుగుతుందని చెప్పొచ్చు.