మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లా కుల్దాబాద్ ప్రాంతంలో ఉన్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధిని వెంటనే తొలగించాలని విహెచ్‌పీ (విశ్వ హిందూ పరిషత్), భజరంగ్ దళ్ డిమాండ్ చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే, 1992లో కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చినట్లుగానే, ఈ సమాధిని తాము తొలగిస్తామని హెచ్చరించారు.ఈ నేపథ్యంలో, మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలోని ఔరంగజేబ్ సమాధి వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. పోలీసు విభాగాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ డిమాండ్
ఔరంగజేబ్ సమాధి నాటి వెట్టి చాకిరీకి, బానిసత్వానికి, మొఘలుల పాలనలో హిందువులపై జరిగిన వేధింపులకు చిహ్నమని వీహెచ్ పీ, భజరంగ్ దళ్ స్థానిక నేతలు కిషోర్ చవాన్, నితిన్ మహాజన్, సందేశ్ భెగ్డేలు ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లు, తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఈ డిమాండ్‌ను తెలియజేసేలా వినతిపత్రాలు సమర్పించనున్నట్టు ప్రకటించారు.
శివసేన (ఏక్‌నాథ్ శిండే వర్గం) మద్దతు
ఔరంగజేబ్ సమాధిని తొలగించాలన్న డిమాండ్ కు శివసేన (ఏక్ నాథ్ శిండే వర్గం) మద్దతు తెలిపింది.ప్రజలను వేధింపులకు, అణచివేతకు గురిచేసిన పాలకుడి సమాధిని ప్రత్యేక భద్రత పెట్టి మరీ కాపాడాల్సిన అవసరం ఏంటని మంత్రి సంజయ్ శిర్సత్ ప్రశ్నించారు.

ప్రభుత్వ చర్యలు ,భద్రతా ఏర్పాట్లు
వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.ఔరంగజేబ్ సమాధి వద్ద భద్రతను పెంచి, పోలీసు బందోబస్తును మరింత కట్టుదిట్టం చేసింది.అంతేకాదు, రాష్ట్రవ్యాప్తంగా ప్రతికూల ప్రభావం పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్, మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మధ్య విపరీతమైన శత్రుత్వం కొనసాగింది.శివాజీ హిందువుల హక్కుల కోసం పోరాడుతూ మొఘల్ పాలనకు ఎదురు నిలిచారు.చారిత్రక విభేదాలు, సామాజిక అసమానతలు మత ఘర్షణలకు ప్రధాన కారణాలు. ఇలాంటి ఘర్షణలు దేశానికి తీవ్ర నష్టం కలిగిస్తాయి.మతపరమైన వివాదాలు ఎంతో మంది అమాయక ప్రజల ప్రాణాలను బలితీసుకుంటాయి, సామాజిక శాంతి భద్రతలకు భంగం కలిగిస్తాయి.