- ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఉపకరణాల ఉత్పత్తి రంగంలో అగ్రగామి
ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన లగ్జరీ బ్రాండ్ హెర్మ్స్ (Hermès) తన ఉద్యోగులకు భారీ బోనస్ ప్రకటించడం ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. సాధారణంగా, కంపెనీలు లాభాలు సాధించినప్పుడు వాటిని వ్యాపార విస్తరణకు ఉపయోగించుకుంటాయి లేదా వాటాదారులకు డివిడెండ్లు చెల్లిస్తాయి. అయితే, హెర్మ్స్ యాజమాన్యం తన ఉద్యోగులను ప్రోత్సహించేందుకు అదనపు లాభాలను పంచుకోవాలని నిర్ణయించింది.

హెర్మ్స్ ఫ్రాన్స్‌లోని పారిస్‌ను కేంద్రంగా చేసుకుని లగ్జరీ ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఉపకరణాల ఉత్పత్తి రంగంలో అగ్రగామిగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఖరీదైన వస్త్రాలు, బ్యాగులు, ఫుట్‌వేర్, సుగంధ ద్రవ్యాలు, వాచ్‌లు, ఇతర లగ్జరీ ఉపకరణాలను విక్రయిస్తున్న ఈ సంస్థ, నాణ్యతతో పాటు ప్రతిష్ఠను కూడా కొనసాగిస్తోంది. బ్రాండ్ విలువను కాపాడుకోవడం, వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఈ సంస్థ విజయ రహస్యాల్లో ఒకటి.
గత ఆర్థిక సంవత్సరంలో హెర్మ్స్ సంస్థ భారీగా లాభాలను సాధించింది. ఈ కంపెనీ ఏకీకృత ఆదాయం రూ.1.36 లక్షల కోట్లు కాగా, ఉద్యోగుల కృషిని గౌరవిస్తూ ఒక్కొక్కరికి రూ.4 లక్షల బోనస్ ప్రకటించింది. ఈ భారీ బోనస్ తమ సిబ్బంది ఉత్సాహాన్ని మరింత పెంచడమే కాక, సంస్థకు మరింత కట్టుబడి పనిచేసేలా చేయడంలో దోహదం చేస్తుందని హెర్మ్స్ యాజమాన్యం పేర్కొంది. ఈ బోనస్‌ను ప్రస్తుత ఆర్థిక సంవత్సర ప్రారంభంలో ఉద్యోగులకు అందజేయనున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా హెర్మ్స్ సంస్థకు వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, వారందరికీ ఈ బోనస్ ప్రకటించడం ఉద్యోగుల మధ్య విశ్వాసాన్ని పెంచే చర్యగా భావిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సంస్థలు తమ ఉద్యోగులను ప్రోత్సహించేందుకు వివిధ విధానాలను అమలు చేస్తుంటాయి. అయితే, ఉద్యోగులకు నేరుగా భారీ బోనస్ అందించడం చాలా అరుదైన అంశం.