ఎలాంటి ఒప్పందం లేకుండానే వెళ్లిన జెలెన్‌స్కీ
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య.. వాషింగ్టన్ డీసీలోని వైట్‌హౌజ్‌లో జరిగిన భేటీ వాగ్వాదానికి దారి తీసింది. దీంతో ఎలాంటి ఒప్పందం లేకుండానే జెలెన్‌స్కీ వైట్‌హౌస్‌ను వీడారు. అయితే మీడియా ఎదుటే వీరిద్దరి మధ్య వాడీవేడి చర్చ చోటుచేసుకోవడంతో ఉక్రెయిన్ రాయబారి ఒక్సానా మార్కరోవా ఆందోళనకు గురయ్యారు.

అయ్యో.. ఇలా జరుగుతుందేంటీ?
ట్రంప్, జెలెన్‌స్కీ మధ్య సజావుగానే మొదలైన భేటీ కాసేపటికే వాగ్వాదానికి దారితీసింది. ఉక్రెయిన్ తీరు మూడో ప్రపంచయుద్ధానికి దారితీయవచ్చని.. జెలెన్‌స్కీ వైపు వేలెత్తి చూపిస్తూ ట్రంప్ కోపంగా చెప్పారు. ఆ సమయంలో ఇరుదేశాల రాయబారులు ఎదురుగానే ఉన్నారు. ట్రంప్ మాటలు, జెలెన్‌స్కీ ప్రతిస్పందనతో అమెరికాలో ఉక్రెయిన్ రాయబారి అయిన ఒక్సానా గందరగోళానికి గురయ్యారు. అయ్యో.. ఇలా జరుగుతుందేంటీ? అన్నట్లుగా తల పట్టుకున్నారు. ఆమె హవభావాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఇలాంటి ఘర్షణ ఇరుపక్షాలకు మంచిది కాదు
రష్యా చేస్తున్న యుద్ధానికి తెర దించడానికి శాంతి ఒప్పందం కుదర్చడం, దానికి బదులుగా ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించడానికి జెలెన్‌స్కీ శుక్రవారం శ్వేతసౌధానికి వచ్చారు. భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని ఆయన ఒత్తిడి చేశారు. ఇది ట్రంప్‌నకు ఆగ్రహం తెప్పించింది. దీంతో చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. అనంతరం దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఇలాంటి ఘర్షణ ఇరుపక్షాలకు మంచిది కాదన్నారు.