వక్ఫ్ (Waqf) అనేది దాతృత్వం తప్ప మరొకటి కాదని, అది ఇస్లాంలో ముఖ్యమైన భాగం కాదని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టు(Supreme court) కు తెలిపింది. వక్ఫ్ బోర్డులు లౌకిక విధులను మాత్రమే నిర్వహిస్తాయని చెప్పింది. వక్ప్(Waqf) చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం విచారణ చేపట్టగా, కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.పిటిషనర్లు, ఈ చట్ట సవరణలు మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తాయని, వక్ఫ్ (Waqf) బోర్డులలో ముస్లిం సభ్యుల సంఖ్య తగ్గించబడుతుందని, వక్ఫ్ బై యూజర్ ప్రకారం గుర్తింపు పొందిన ఆస్తులను రద్దు చేయడం ద్వారా మతపరమైన హక్కులను హరించబడుతుందని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వక్ఫ్ అనేది ఇస్లామిక్ భావన. కానీ అది ఇస్లాంలో ముఖ్యమైన భాగం కాదు. వక్ఫ్ అనేది దాతృత్వం తప్ప మరొకటి కాదు. దానధర్మాలు ప్రతి మతంలో భాగం. హిందువులకు దానధర్మాలు అనే వ్యవస్థ ఉంది. సిక్కులు కూడా దానిని కలిగి ఉన్నారు. ప్రభుత్వ భూమిపై ఎవరికీ హక్కు లేదు. ప్రభుత్వానికి చెందిన ఆస్తిని వక్ఫ్‌గా ప్రకటిస్తే ప్రభుత్వం ఆ ఆస్తిని కాపాడుకోగలదని సుప్రీంకోర్టు తీర్పు చెబుతోంది” అని తుషార్ మెహతా వ్యాఖ్యానించారు.

పిటిషనర్ల అభ్యంతరాలు
ఉపశమన ఉత్తర్వులకు సంబంధించి ముందుగా నిర్ణయించిన మూడు అంశాలకే పరిమితమై విచారణ జరగాలని మరోసారి సుప్రీంను మెహతా కోరారు. బ్రిటిష్, వరుస భారత ప్రభుత్వాలు పరిష్కరించలేని సమస్యలను తాజా వక్ఫ్ (Waqf) చట్ట సవరణలు పరిష్కరించాయని తెలిపారు. “1923 నుంచి ఉన్న ముప్పును మేం నిర్మూలిస్తున్నాం. ప్రతి వాటాదారుడి వాదనలు విన్నాం. కొంతమంది పిటిషనర్లు మొత్తం ముస్లిం సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకోలేరు. మాకు 96 లక్షల ప్రాతినిధ్యాలు వచ్చాయి. JPC 36 సమావేశాలు నిర్వహించింది” అని సొలిసిటర్ జనరల్ చెప్పారు.
తాత్కాలిక ఉత్తర్వులు
అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం-2025పై మధ్యంతర ఉపశమన ఉత్తర్వులు జారీ చేయాలంటే అందుకు బలమైన కారణాలను చూపాలని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచనతోనే సవరణ చట్టంలో పలు నిబంధనలను రూపొందించారని కపిల్ సబల్ ఆరోపించారు. చట్టంలోని వివిధ సెక్షన్లపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ అభిషేక్ మను సింఘ్వితోపాటు వాదనలు వినిపించారు.సుప్రీంకోర్టు, పిటిషనర్ల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, వక్ఫ్ బై యూజర్ ప్రకారం గుర్తింపు పొందిన ఆస్తులపై మార్పులు చేయరాదని, వక్ఫ్ బోర్డులలో కొత్త నియామకాలు చేయరాదని కేంద్రానికి ఆదేశించింది.