తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ నెల 25న జస్టిస్ బీఆర్ గవాయ్, అగస్టిన్ జార్జ్ మసిహ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వాదనలు స్వీకరించనుంది. ఈ అంశం రాజకీయంగా, చట్టపరంగా కీలకమైనది కావడంతో, ఈ విచారణపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం, ఎన్నికైన ప్రజా ప్రతినిధులు తమ పార్టీని వీడితే, వారిపై అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్‌కు ఉంటుంది.

BRS పార్టీలో గెలిచి, అనంతరం ఇతర పార్టీలకు గెళిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, కాలె యాదయ్య, కృష్ణమోహన్, ప్రకాశ్ గౌడ్, మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీ, దానం నాగేందర్, తెల్లం వెంకటేశ్ యాదవ్, కడియం శ్రీహరి లపై చర్యలు తీసుకోవాలని BRS నేతలు, ముఖ్యంగా KTR ఆధ్వర్యంలో పిటిషన్లు దాఖలయ్యాయి. వీరు తమ గెలిచిన పార్టీని విడిచి వెళ్లినందున, చట్టపరంగా అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ కేసు ఫలితం తెలంగాణ రాజకీయాలపై కీలక ప్రభావం చూపనుంది. ఒకవేళ కోర్టు అనర్హతను అమలు చేయాలని తీర్పు ఇచ్చినట్లయితే, ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు, ఈ కేసులో అనుకూల తీర్పు వస్తే, ఇతర పార్టీలకు వెళ్లిన ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా తమ పదవిని కొనసాగించగలరు. ఈ విచారణకు అన్ని రాజకీయ పార్టీల నేతలు ప్రాధాన్యత ఇస్తూ, తదుపరి పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు.