బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
అమరావతి: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ కస్టడీ, హెల్త్ పిటిషన్లపై ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు ఇవాళ(శుక్రవారం) విచారణ చేపట్టింది. ఈ తీర్పును సోమవారానికి కోర్టు వాయిదా వేసింది. అలాగే వంశీ బెయిల్ పిటిషన్‌ను కూడా మంగళవారానికి న్యాయస్థానం వాయిదా వేసింది. పోలీసులు కౌంటర్ దాఖలు చేయడం కోసం సమయం కోరడంతో వంశీ బెయిల్ పిటిషన్‌ను ఎస్సీ , ఎస్టీ స్పెషల్ కోర్టు వాయిదా వేసింది.

కస్టడీ కోసం పిటీషన్..
కాగా.. ప్రస్తుతం జైల్లో ఉన్న వంశీని పదిరోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్‌పై ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరిగిన విషయం తెలిసిందే. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి వంశీని కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందని.. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయాల్సి ఉందని పోలీసులు కోర్టుకు విన్నవించారు. అయితే సీన్ రీకన్‌స్ట్రక్షన్ అవసరం లేదని వంశీ తరపు లాయర్ వాదించారు. సత్యవర్ధన్ బయటే ఉన్నందున అతడిని విచారిస్తే సరిపోతుందని ఆయన అన్నారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది.
బెయిల్ నిరాకరణ..
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ముందుస్తు బెయిల్ కోరుతూ వంశీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించాలని న్యాయస్థానం సూచించింది. ఇదే కేసులో గతంలో 36 మందికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వారంతా విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఈ 36 మందికి ఎదురుదెబ్బే తగిలింది. వీరికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఎస్సీ, ఎస్టీ కోర్టు కూడా నిరాకరించింది. తాజాగా వంశీకి కూడా ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టుకు నిరాకరిచింది.