ప్రస్తుతం ఉన్న అత్యధిక మానసిక ఒత్తిడి, ఉద్యోగ జీవితంలో పోటీ, వ్యక్తిగత సంబంధాల ఒడిదుడుకులు ఇవన్నీ మనకు తెలియకుండానే మన ఆలోచనా సరళిని ప్రభావితం చేస్తుంటాయి. ముఖ్యంగా ఓ విషయంలో మళ్లీ మళ్లీ ఆలోచించటం – దీనిని సాధారణంగా “ఓవర్ థింకింగ్” లేదా “అతిగా ఆలోచించడం“గా (Over thinking) అభివర్ణిస్తారు. ఇది ఒకసారి అలవాటయ్యే విధంగా మారితే మన ఆరోగ్యానికే మన భావోద్వేగాలను, వ్యక్తిగత అభివృద్ధిని తీవ్రంగా దెబ్బతీస్తుంది.

అతిగా ఆలోచించడం అంటే ఏమిటి?
ఒక చిన్న విషయాన్ని మళ్లీ మళ్లీ ఆలోచిస్తూ దానిపై పరిమితి లేని ఊహాలోకాలలో విహరించడం అతిగా ఆలోచించడం. ఉదాహరణకు – ఎవరో మీ మాటను తప్పుగా అర్థం చేసుకున్నారేమో అన్న భావనతో ఒకే విషయం మీద గంటల తరబడి ఆలోచించడం. లేదా జరిగిన సంఘటనను పదే పదే గుర్తు చేసుకుంటూ, “అలా కాకుండా ఇలా మాట్లాడుంటే బాగుండేదేమో” అని విచారించటం.
ఓవర్ థింకింగ్ వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు
నిద్రలేమి – రాత్రి పడుకున్న తర్వాత ఆలోచనలు ఆగకపోవడం వల్ల నిద్ర పట్టకపోవచ్చు. రాత్రిళ్లు మనసు ప్రశాంతంగా లేకపోతే నిద్ర బాగా రాదు. నిద్రలోంచి మధ్యలో మేల్కొనడం, మళ్లీ నిద్ర పట్టకపోవడం జరిగితే ఇది మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. దీర్ఘకాలంగా ఇలా జరుగుతుంటే అనేక రకాల ఆరోగ్య సమస్యలు రావచ్చు.
ఆత్మవిమర్శ – “నేను ఎందుకు అలా చేసాను?”, “నాలో ఏదో లోపముందేమో?” అన్న భావనలు పెరిగిపోతాయి.
ఆత్మవిశ్వాసహీనత – నిర్ణయాలపై గందరగోళం వల్ల, భయాల వల్ల మనలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. ఏదైనా పని చేయాలంటే ముందుగా భయపడటం, మన అభిప్రాయాన్ని చెప్పకుండా మౌనంగా ఉండిపోవడం కూడా అతిగా ఆలోచించే లక్షణాలు. ఇలా ఉంటే పనులు ఆలస్యమవుతాయి.
సంబంధాలపై ప్రభావం – ఒకరితో జరిగిన చిన్న మాటా మార్పును చాలా సీరియస్‌గా తీసుకొని సంబంధాలను చెడగొట్టుకునే ప్రమాదం ఉంటుంది.
ఆరోగ్య సమస్యలు (Health problems)– ఒత్తిడితో కలిగే బీపీ, మైగ్రేన్, జీర్ణ సంబంధిత సమస్యలు అధికంగా కనిపిస్తాయి.

దీనిపై మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు:
ఆలోచనలను వ్రాయడం – మీరు ఎవరితోనూ మాట్లాడలేకపోతే, డైరీలో రాయండి. ఇది ఓ తాత్కాలిక ఉపశమనం.
ధ్యానం, మైండ్‌ఫుల్‌నెస్ – ప్రతి రోజు కనీసం 10 నిమిషాలు ధ్యానం చేయడం ద్వారా మనస్సు ప్రశాంతంగా మారుతుంది.
శారీరక వ్యాయామం – రోజూ 30 నిమిషాలు నడక, యోగా చేయడం వల్ల ఆలోచనలు మళ్లీ చక్కబడతాయి.
నమ్మకమైన వారితో మాట్లాడండి – మౌనంగా ఉండకుండా, మీరు నమ్మే వ్యక్తికి మీ భావాలను వ్యక్తం చేయండి.
నెగెటివ్ ఆలోచనలను విస్మరించండి – అవసరమైన దానిపై మాత్రమే ఆలోచించండి. మిగిలినవన్నీ వదిలేయండి.
నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి – సెల్‌ఫోన్, టీవీలను నిద్రకు ముందు దూరంగా పెట్టండి. మైండ్ రెస్ట్ తీసుకోండి.
ఓవర్ థింకింగ్ అనేది మనకు తెలియకుండానే జీవితాన్ని నెమ్మదిగా నియంత్రించేస్తుంది. ఇది ఒక చిన్న అలవాటు లాంటిది, కానీ దీన్ని గుర్తించి, తగిన మార్గదర్శకంతో నియంత్రించగలిగితే జీవితంలో అనేక రంగాల్లో మనం ముందుకు సాగగలుగుతాం. మీ మానసిక శాంతి ఎంతో విలువైనది. అలాగని ఏ సమస్యను చిన్నచూపు చూడకండి. అవసరమైతే మానసిక నిపుణుల సలహా తీసుకోండి. మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యంతో సమానమే.
Read also: Blood pressure: రక్తపోటును లైట్ గా తీసుకోవద్దు..జాగ్రత్తలు తప్పనిసరి