మన శరీరంలో రక్తపోటు స్థిరంగా ఉండేలా చూసుకోవడం ఆరోగ్యంగా జీవించేందుకు ఎంతో అవసరం. ముఖ్యంగా ఈ రోజుల్లో చిన్న వయస్సులోనే హై బీపీ (High Blood Pressure) సమస్య ఎక్కువ మందిని ప్రభావితం చేస్తోంది. అయితే సరైన ఆహారం, జీవనశైలి మార్పులతో ఈ సమస్యను సమర్థంగా నియంత్రించవచ్చు.
సోడియం అధికంగా ఉన్న ఆహారాలు ప్రమాదకరం
శరీరంలో సోడియం స్థాయిలు అధికమైతే, దాన్ని శరీరం బయటకు పంపేందుకు ఎక్కువ శ్రమిస్తుంది. ఇది రక్తనాళాల గోడలపై ఒత్తిడిని పెంచి బీపీని పెంచే ప్రధాన కారణంగా మారుతుంది. ఎక్కువ ఉప్పు ఉన్న ఫాస్ట్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ మాంసాహారాలు ఈ సోడియం లెవెల్‌ను పెంచుతాయి. దీనివల్ల అధిక రక్తపోటు (Hypertension) వేగంగా ప్రబలుతుంది.

హైబీపీకి కారణమయ్యే జీవనశైలి లోపాలు
బీపీ పెరగడానికి సోడియం మాత్రమే కాకుండా, ఇతర కారణాలు కూడా ఉన్నాయి. శారీరక వ్యాయామం లేకపోవడం, గంటల తరబడి కూర్చుని పనిచేయడం, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, అధిక కొలెస్ట్రాల్, ధూమపానం, మద్యపానం వంటి జీవితశైలి లోపాలు కూడా హైబీపీని ప్రేరేపిస్తాయి. ఈ కారణాల వల్ల యవకుల్లో కూడా అధిక రక్తపోటు కేసులు పెరుగుతున్నాయి.
డ్యాష్ డైట్ (DASH Diet) తో బీపీ అదుపులో
వైద్య నిపుణులు హైబీపీ ఉన్నవారు “DASH Diet” పాటించాలంటున్నారు. ఇది Dietary Approaches to Stop Hypertension అనే పేరుతో ప్రసిద్ధి. ఇది పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వు కలిగిన పాల ఉత్పత్తులు, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన విత్తనాలు, పప్పులపై ఆధారపడిన ఆహార విధానం. ఇది బీపీని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
పండ్లు, కూరగాయలు – ముఖ్యమైన భాగం
డ్యాష్ డైట్‌లో పండ్లు, కూరగాయలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో ఉండే పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్‌లు రక్తపోటును నియంత్రించడంలో కీలకం. పాలకూర, కొత్తిమీర, క్యారెట్, బీట్‌రూట్, బ్రోకలీ, చిలగడదుంపలు, ఆలుగడ్డలు వంటి కూరగాయలను పచ్చిగా లేదా ఉడికించి తినాలి. అరటిపండు, నారింజ, పుచ్చకాయ, తర్బూజా, దానిమ్మ వంటి పండ్లు కూడా ప్రతి రోజూ ఆహారంలో ఉండాలి.
తృణధాన్యాలు – ఫైబర్, గుండె ఆరోగ్యానికి దోహదం
బ్రౌన్ రైస్, ఓట్స్, హోల్ వీట్ బ్రెడ్, బార్లీ వంటి తృణధాన్యాలు ఫైబర్‌తో పాటు విటమిన్ B సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఇవి రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. శాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం.

ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు – బీపీకి సహాయకం
సాల్మన్, మాకరెల్, ట్యూనా వంటి చేపలలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వారంలో రెండు నుంచి మూడు సార్లు చేపలు తినడం వల్ల బీపీ తగ్గే అవకాశముంది. ఇది గుండెపోటును (Heart Attack) నివారించడంలో కూడా సహాయపడుతుంది.
పప్పులు, విత్తనాలు – ఆరోగ్యకరమైన పోషకాలు
నల్ల శనగలు, బ్లాక్ బీన్స్, సోయాబీన్స్, రాజ్మా వంటి పప్పుల్లో ప్రోటీన్, పొటాషియం అధికంగా లభిస్తుంది. అవిసె గింజలు, చియా సీడ్స్, బాదంపప్పు, వాల్‌నట్స్ వంటి వాటిలో ఫైబర్ మరియు హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి రక్తనాళాల విస్తరణకు తోడ్పడతాయి. మజ్జిగ, కొవ్వు లేని పాలు కూడా బీపీ ఉన్నవారికి అనుకూలం.
ఉప్పు పరిమితంగా – ప్రధాన నియమం
బీపీ అదుపులో ఉంచాలంటే రోజూ తినే ఉప్పు పరిమితముగా ఉండాలి. ఒక రోజు చాలు సోడియం పరిమితి 1500mg లోపల ఉండాలి. అలాగే ప్యాకేజ్డ్ లేదా రెడీమేడ్ ఫుడ్ ఉప్పు అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి అవి తగ్గించాలి.
ఆహారంతో పాటు జీవనశైలి మార్పులు కూడా అవసరం
డ్యాష్ డైట్ పాటించడం మాత్రమే కాదు, వ్యాయామం, యోగా, ధ్యానం, సమయానికి నిద్ర వంటి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. వాతావరణానికి అనుగుణంగా నీరు తాగడం, స్ట్రెస్ తగ్గించుకోవడం కూడా సహాయకం.
హైబీపీ అనేది ఒక్కసారి వచ్చిన తర్వాత జీవితాంతం శ్రద్ధ తీసుకోవాల్సిన సమస్య. కానీ సరైన ఆహారం, నియమిత జీవనశైలితో దాన్ని అదుపులో ఉంచవచ్చు. ముఖ్యంగా డ్యాష్ డైట్, తక్కువ ఉప్పు, తక్కువ కొవ్వు, అధిక ఫైబర్ కలిగిన ఆహారం తీసుకుంటూ ఉండడం ద్వారా అధిక రక్తపోటు సమస్యను అడ్డుకోగలమన్నది వైద్య నిపుణుల మాట.
Read also: Ajwain: సకల రోగ నివారిణి వాము