విషపదార్థాలు బయట తినే ఆహారంలో ఉంటాయన్న అపోహ చాలామందిలో ఉంటుంది. అయితే, ఇంట్లో వండిన ఆహారాన్ని సరైన జాగ్రత్తలు పాటించకుండా నిల్వ చేయడం, పదేపదే వేడి చేయడం వల్ల అదే ఆహారం ఆరోగ్యానికి ముప్పుగా మారవచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఫ్రిజ్‌లో నిల్వ, మళ్లీ వేడి చేయడంపై నిపుణుల హెచ్చరిక
మారిన జీవనశైలి నేపథ్యంలో చాలా మంది రెండు, మూడు రోజులకు సరిపడేలా వండిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో నిల్వ పెట్టి, అవసరమైనప్పుడు మళ్లీ వేడి చేసి తినడం అనేక ఇళ్లలో సాధారణంగా మారిపోయింది. కానీ దీనిపై సరైన అవగాహన లేకపోవడం వల్ల ఫుడ్ పాయిజన్, జీర్ణ సమస్యలు ఎక్కువవుతున్నాయి.

బంగాళాదుంప – మళ్లీ వేడి చేయొద్దు
వండిన బంగాళాదుంపను గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ సేపు వదిలితే క్లోస్ట్రీడియం బోటులినం (Clostridium botulinum)అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది మళ్లీ వేడి చేసినా చనిపోదు. వికారం, వాంతులు వంటి సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి మిగిలిన బంగాళాదుంప కూరను మళ్లీ వేడి చేయడం మంచిది కాదు.
కోడిగుడ్లు – పోషకాల నష్టం, జీర్ణ సమస్యలు
వండిన గుడ్లను మళ్లీ వేడి చేస్తే వాటిలోని ప్రోటీన్లు(proteins), పోషకాల విలువలు తగ్గిపోతాయి. ఇది ఎసిడిటీ, కడుపుబ్బరం వంటి సమస్యలకు దారి తీస్తుంది. అలాగే, పూర్తిగా ఉడికని గుడ్లు వేడి చేస్తే, సాల్మనెల్లా బ్యాక్టీరియా పెరిగి డయేరియా, జ్వరం, వాంతులు కలిగించే ప్రమాదం ఉంటుంది.
పాలకూర – క్యాన్సర్ ముప్పు?
పాలకూరలో ఉండే నైట్రేట్లు, మళ్లీ వేడి చేస్తే నైట్రోసమైన్లు అనే రసాయనాలుగా మారే అవకాశముంది. ఇవి క్యాన్సర్ కారకాలుగా పరిగణించబడతాయి. కాబట్టి వండిన పాలకూరను వెంటనే తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
పుట్టగొడుగులు – జీర్ణ సమస్యలు, గుండె ఆరోగ్యానికి హానికరం
పుట్టగొడుగుల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వలన, వీటిని గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ పెట్టి మళ్లీ వేడి చేస్తే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది జీర్ణ సమస్యలు, వాంతులు, డయేరియా లాంటి అనారోగ్యాలకు దారి తీస్తుంది. కొన్ని సందర్భాల్లో గుండె జబ్బులు రావడానికీ కారణమవుతుందట.
మాంసం – తప్పనిసరిగా 74°C వద్ద వేడి చేయాలి
ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన మాంసాన్ని మళ్లీ వేడి చేస్తే ప్రోటీన్ గట్టిపడే అవకాశం ఉంది. ఇది జీర్ణానికి ఇబ్బందికరంగా మారుతుంది. అలాగే, తక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే బ్యాక్టీరియా చనిపోవడం జరగదు. కనుక మాంసాన్ని తిరిగి తినాలంటే కనీసం 74 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేయాలంటున్నారు.
అన్నం – బేసిల్లస్ సెరియస్ ముప్పు
వండిన అన్నాన్ని తిరిగి వేడి చేయడం కూడా చాలా ప్రమాదకరం. ఇది బేసిల్లస్ సెరియస్ (Bacillus cereus) అనే బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది. ఇది వేడి చేసినా చనిపోదు. దీనివల్ల ఫుడ్ పాయిజన్, వాంతులు, పొట్టనొప్పి వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: