కండరాలను పెంచుకోవడానికి చాలా మంది జిమ్ చేస్తూ ఉంటారు. జిమ్ చేయడం, బరువులు ఎత్తడం వల్లనే కండరాలు దృఢంగా తయారవుతాయని చాలా మంది భావిస్తారు. కానీ కండరాల పెరుగుదలకు వ్యాయామం చేయడం ఒక్కటే మార్గం కాదు. కండరాల (Muscles)పెరుగుదల మీరు జిమ్ చేసే ముందు, చేసిన తరువాత తీసుకునే ఆహారాలపై కూడా ఆధారపడి ఉంటుంది. మీరు తీసుకునే ఆహారంపైనే కండరాలు (Muscles) ఎంత వేగంగా పెరుగుతాయి, ఎంత త్వరగా కోలుకుంటాయి అనేది ఆధారపడి ఉంటుంది. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, సరైన కార్బొహైడ్రేట్లు వంటి పోషకాలను తీసుకున్నప్పుడే కండరాల పెరుగుదల, మరమ్మత్తు వేగంగా ఉంటుంది. ఏం తినాలో.. ఎప్పుడు తినాలో.. తెలుసుకున్నప్పుడే మన శరీర కండరాలు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటాయి. కండరాలను పెంచుకోవాలనుకునే వారు వ్యాయామం చేయడంతో పాటు తీసుకోదగిన ఆహారాల గురించి.. అలాగే వీటిని ఎప్పుడు తీసుకోవాలి.. అన్న వివరాల గురించి పోషకాహార నిపుణులు వివరిస్తున్నారు.
Read Also: HealthyDiet: హైబీపీ నియంత్రణ కోసం ఆరోగ్యకర ఆహార సూచనలు

చికెన్ బ్రెస్ట్
ప్రోటీన్ ఎక్కువగా, కొవ్వు తక్కువగా ఉండే ఆహారాల్లో చికెన్ బ్రెస్ట్ ఒకటి. దీనిలో 26 నుండి 31 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. గ్రిల్ చేసుకుని లేదా తక్కువ నూనెతో ఫ్రై చేసుకుని దీనిని తీసుకోవచ్చు. జిమ్ కు ముందు లేదా తర్వాత అయినా దీనిని తీసుకోవచ్చు. బ్రౌన్ రైస్ తో ఈ చికెన్ బ్రెస్ట్ ను తీసుకుంటే త్వరగా కోలుకుంటారు. అలాగే పెరుగును తీసుకోవడం వల్ల కూడా మన శరీరానికి తగినంత ప్రోటీన్ అందుతుంది. దీనిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. పెరుగును తీసుకోవడం వల్ల కండరాలకు ఆమైనో ఆమ్లాలు స్థిరంగా అందుతాయి. వ్యాయామం తరువాత లేదా పడుకునే ముందు పెరుగును తీసుకోవడం మంచిది. కండరాలకు అవసరమయ్యే అమైనో ఆమ్లాలు, విటమిన్ బి12, విటమిన్ డి, వ్యాయామం తరువాత తిరిగి శక్తిని పొందడానికి అవసరమయ్యే కొవ్వులు ఉండే ఆహారాల్లో గుడ్డు ఒకటి.
చేపలు
రోజూ ఒక ఉడికించిన గుడ్డును పచ్చసొనతో సహా తీసుకోవడం వల్ల కండరాల పెరుగుదల వేగంగా ఉంటుంది. ఇక ప్రోటీన్ తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉండే ఆహారాల్లో చేపలు ఒకటి. ఇవి ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లతో నిండి ఉంటాయి. చేపలను తీసుకోవడం వల్ల కండరాల మరమ్మత్తు వేగంగా ఉంటుంది. వారానికి రెండు సార్లు మధ్యాహ్న భోజనంలో లేదా రాత్రి భోజనంలో వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సలాడ్ రూపంలో, గ్రిల్ రూపంలో వీటిని తీసుకునే ప్రయత్నం చేయాలి. మొక్క ఆధారిత ప్రోటీన్ ను కలిగి ఉండే వాటిలో కినోవా ఒకటి. వీటిలో తొమ్మిది రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఫైబర్, ఐరన్, మెగ్నిషియం వంటి పోషకాలు కూడా ఇందులో ఉంటాయి. ఈ పోషకాలన్నీ కండరాలు బాగా పనిచేయడానికి, శక్తిని పెంచడానికి దోహదపడతాయి. కండరాల పెరుగుదలకు రాత్రి భోజనంలో కినోవాను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

పనీర్
కాటేజ్ చీజ్ లేదా పనీర్ ప్రోటీన్ తో నిండి ఉంటుంది. ఇది నెమ్మదిగా జీర్ణమవుతుంది. కనుక గంటల తరబడి కండరాలకు కావల్సిన శక్తి లభిస్తుంది. దీనిని రాత్రిపూట తీసుకోవడం మంచిది. సలాడ్, గ్రిల్ వంటి వాటితో దీనిని తీసుకోవడం వల్ల కండరాలకు కావల్సిన శక్తి లభిస్తుంది. అలాగే తృణ ధాన్యాలను, గింజలను తీసుకోవడం వల్ల కండరాల మరమ్మత్తు వేగంగా ఉంటుంది. వీటిలో ఉండే మెగ్నిషియం కండరాల పనితీరును, వాటిని మరమ్మత్తు చేయడంలో సహాయపడుతుంది. వీటిని స్నాక్స్ గా తీసుకోవడం మంచిది. ప్రోటీన్స్, మంచి కొవ్వులు, ఇతర పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవడం వల్ల కండరాల పెరుగుదల వేగంగా ఉండడంతో పాటు వాటి మరమ్మత్తు కూడా చక్కగా జరుగుతుంది. ఇక వ్యాయామం చేసిన 30 నుండి 90 నిమిషాల వ్యవధిలో కొంత ప్రోటీన్, కార్బొహైడ్రేట్స్ తీసుకోవాలని ఒక లక్ష్యంగా పెట్టుకుని సరైన ఆహారాన్ని తీసుకోవాలి. వ్యాయామం చేయడంతోపాటు ఇలా చక్కటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యకరమైన, ధృడమైన కండరాలను సొంతం చేసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: