చిలగడదుంపలు (Sweet Potatoes) తమ పోషక గుణాలతో సూపర్ ఫుడ్‌లుగా గుర్తింపు పొందాయి. కాన్వోల్వులేసి కుటుంబానికి చెందిన ఈ వేరుకూరలు నారింజ, ఊదా వంటి ఆకర్షణీయ రంగుల్లో లభిస్తాయి. వీటిలో విటమిన్ A, C, B6, పొటాషియం, మాంగనీస్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాదు, ఫ్రీ రాడికల్స్ వల్ల శరీరానికి కలిగే నష్టాన్ని తగ్గించే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు కూడా వీటిలో ఉంటాయి.

మధుమేహులకు చిలగడదుంప ఎందుకు మంచిది?
చిలగడదుంపల్లో(Sweet potatoes) గ్లైసెమిక్ ఇండెక్స్(Glycemic index) తక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నియంత్రణలో ఉంచుతుంది. అధిక ఫైబర్ ఉండటం వల్ల ఇది మధుమేహానికి అనుకూలమైన ఆహారంగా నిపుణులు సూచిస్తున్నారు. పీచు జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు బరువు తగ్గడంలో కూడా సహాయం చేస్తుంది.
జీర్ణవ్యవస్థకు కలిగే ప్రయోజనాలు
చిలగడదుంపలు డైటరీ ఫైబర్‌లో చాలా పుష్కలంగా ఉంటాయి. దీంతో ప్రేగుల కదలికలు మెరుగుపడి మలబద్ధకం నివారించబడుతుంది. నియమితంగా తీసుకుంటే జీర్ణవ్యవస్థ మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది.
గుండె ఆరోగ్యానికి మేలు
ఈ దుంపల్లో ఉన్న అధిక పొటాషియం గుండె స్పందనను సమతుల్యంగా ఉంచుతుంది. ఫైబ్రినోజెన్ వంటి సమ్మేళనాలు రక్తం గడ్డకట్టకుండా సహాయపడతాయి. దీంతో హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. చిలగడదుంపలు బీటా-క్యారోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లకు అద్భుతమైన మూలం. ఇవి శరీరాన్ని క్యాన్సర్ కారక కణాల నుంచి రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చిలగడదుంపల్లోని యాంటీఆక్సిడెంట్లు మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి మెరుగుపడేందుకు తోడ్పడతాయి. వృద్ధాప్యంలో కూడా మానసిక ఆరోగ్యం కాపాడటంలో ఇవి మంచి పాత్ర పోషిస్తాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: