2025 జూలై 1 నుండి దేశంలో ప్రసిద్ధ ప్రైవేటు రంగ బ్యాంకులు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ తమ వినియోగదారులకు అందించే వివిధ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, బ్యాంకింగ్ సేవల రుసుములను పెంచుతున్నట్టు ప్రకటించాయి. ఈ మార్పులు లక్షలాది ఖాతాదారులపై ప్రత్యక్షంగా ప్రభావం చూపనున్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రుసుములు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రధానంగా ఆన్‌లైన్ గేమింగ్, డిజిటల్ వాలెట్లు, యుటిలిటీ బిల్లుల చెల్లింపులపై క్రెడిట్ కార్డ్ రుసుములను పెంచింది.
ఆన్‌లైన్ గేమింగ్: డ్రీమ్11, రమ్మీ కల్చర్, జంగిల్లీ గేమ్స్, ఎంపీఎల్ వంటి ఆన్‌లైన్ స్కిల్-బేస్డ్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై ఒక నెలలో రూ. 10,000 కంటే ఎక్కువ ఖర్చు చేస్తే, ఆ నెలలో చేసిన మొత్తం గేమింగ్ ఖర్చుపై 1 శాతం రుసుము విధిస్తారు. ఈ రుసుము నెలకు గరిష్ఠంగా రూ. 4,999గా నిర్ణయించారు. అంతేకాకుండా, ఇలాంటి గేమింగ్ లావాదేవీలపై ఎలాంటి రివార్డు పాయింట్లు లభించవని బ్యాంక్ స్పష్టం చేసింది.
డిజిటల్ వాలెట్ లోడ్: పేటీఎం, మొబిక్విక్, ఫ్రీచార్జ్, ఓలా మనీ వంటి థర్డ్-పార్టీ వాలెట్లలో హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు ఉపయోగించి ఒక నెలలో రూ. 10,000 కంటే ఎక్కువ మొత్తాన్ని లోడ్ చేస్తే, ఆ మొత్తంపై 1 శాతం చార్జ్ వర్తిస్తుంది. ఈ రుసుము కూడా నెలకు గరిష్టంగా రూ. 4,999గా ఉంటుంది.
యుటిలిటీ బిల్లులు: ఒక నెలలో మొత్తం ఖర్చు రూ. 50,000 దాటితే, 1 శాతం చార్జ్ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీనికి కూడా నెలవారీ గరిష్ట పరిమితి రూ. 4,999గా ఉంది. అయితే, బీమా చెల్లింపులను యుటిలిటీ చెల్లింపులుగా పరిగణించబోమని, కాబట్టి వాటిపై అదనపు చార్జీలు ఉండవని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్పష్టం చేసింది.
ఇతర లావాదేవీలు: అద్దె, ఇంధనం, విద్యా సంబంధిత లావాదేవీలపై విధించే గరిష్ఠ చార్జీలను కూడా బ్యాంక్ సవరించింది. ఈ కేటగిరీలలో ఒక్కో లావాదేవీకి గరిష్ఠ చార్జీ రూ. 4,999గా ఉంటుంది. అద్దె చెల్లింపులపై 1 శాతం రుసుము యథాతథంగా కొనసాగుతుంది. ఇంధన లావాదేవీలు రూ. 15,000 దాటితే 1 శాతం చార్జ్ విధిస్తారు. అయితే, కళాశాల లేదా పాఠశాల అధికారిక వెబ్‌సైట్ల ద్వారా లేదా వారి కార్డు మెషీన్ల ద్వారా నేరుగా చేసే విద్యా చెల్లింపులపై ఎలాంటి చార్జీ ఉండదని బ్యాంక్ తెలిపింది.
ఐసీఐసీఐ బ్యాంక్ సేవల చార్జీలలో మార్పులు
నగదు, చెక్ డిపాజిట్, డీడీ, పీవో: నగదు, చెక్కుల డిపాజిట్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ), పే ఆర్డర్ (పీవో) లావాదేవీల రుసుములను మార్చింది. ఇకపై, ప్రతి రూ. 1,000 డిపాజిట్‌కు రూ. 2 చొప్పున చార్జ్ వసూలు చేస్తారు. దీనికి కనీస రుసుము రూ. 50 కాగా, గరిష్ఠంగా రూ. 15,000 వరకు ఉంటుంది. గతంలో, రూ. 10,000 వరకు డిపాజిట్లకు రూ. 50, ఆపైన ప్రతి రూ. 1,000కి రూ. 5 చొప్పున బ్యాంక్ చార్జ్ చేసేది.
ఏటీఎం లావాదేవీలు: ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మూడు ఉచిత లావాదేవీల తర్వాత ఆర్థిక లావాదేవీలకు రూ. 23, ఆర్థికేతర లావాదేవీలకు రూ. 8.5చార్జ్ చేస్తుంది. గతంలో ఆర్థిక లావాదేవీ రుసుము రూ. 21గా ఉండేది.
సొంత ఏటీఎంలు: ఐసీఐసీఐ బ్యాంక్ సొంత ఏటీఎంల విషయానికొస్తే, సాధారణ సేవింగ్స్ ఖాతాదారులు నెలకు మొదటి ఐదు లావాదేవీల తర్వాత చేసే ప్రతి ఆర్థిక లావాదేవీకి రూ. 23 చెల్లించాల్సి ఉంటుంది. ఇది గతంలో రూ. 21గా ఉండేది.
డెబిట్ కార్డు వార్షిక రుసుము: రూ. 200 నుంచి రూ. 300కి పెరిగింది.
డెబిట్ కార్డు రీప్లేస్‌మెంట్ ఫీజు: రూ. 200 నుంచి రూ. 300కి పెరిగింది.
Read also: WhatsApp: వాట్సాప్ స్టేటస్ కోసం నాలుగు సరికొత్త ఫీచర్లు