ఈ నెల 22న ప్రారంభమైన ఐపీఎల్ 18వ సీజన్ క్రికెట్ ప్రేమికులను ఎంతగానో అలరిస్తోంది. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఐపీఎల్‌కు భారీ స్థాయిలో ప్రేక్షకాదరణ లభిస్తోంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

HCA సరికొత్త నిర్ణయం
ఈ క్రమంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగుల కోసం ఉచిత ఐపీఎల్ టికెట్లు అందించనున్నట్లు ప్రకటించింది. స్టేడియంకు వచ్చి మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే దివ్యాంగులకు ఫ్రీ పాస్‌లు అందించనున్నారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఈ టికెట్లు పొందాలనుకునే వారు తమ పేరు, కాంటాక్ట్ నంబర్, వ్యాలిడ్ డిసేబిలిటీ ప్రూఫ్, అవసరమైన మ్యాచ్ వివరాలను పంపించాల్సి ఉంటుంది. వివరాలు పంపించాల్సిన మెయిల్ ఐడీ- pcipl18rgics@gmail.com సీట్లు పరిమితంగా ఉన్నాయి. ముందు దరఖాస్తు చేసిన వారికి ప్రాధాన్యమిస్తారు. ఎంపికైన వారికి మెయిల్ ద్వారా సమాచారం అందించబడుతుంది. ఈరోజు హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) – లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్ల మధ్య పోటీ జరుగనుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. భారీ సంఖ్యలో అభిమానులు హాజరవుతారనే నేపథ్యంలో పోలీసులు కఠిన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరి అనుమతి లేకుండా స్టేడియం ప్రాంతంలోకి ప్రవేశించకుండా ప్రత్యేకమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీస్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ స్టేడియంలో రాష్ట్ర పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. HCA తీసుకున్న ఈ నిర్ణయం దివ్యాంగులకే కాకుండా మొత్తం క్రికెట్ అభిమానులకు సంతోషకరమైన వార్త. హైదరాబాదీ అభిమానులు తమ సొంత జట్టును స్టేడియంలో ప్రత్యక్షంగా చూసేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.