చెన్నై: సీఎం ఎంకే స్టాలిన్ తమిళనాడు ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. తమిళనాడు ప్రజలు అత్యవసరంగా పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేస్తున్న కుటుంబ నియంత్రణ చర్యలు ఇప్పుడు ప్రతికూల స్థితిలో ఉంచాయని వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తమిళనాడు రాష్ట్రం 8 ఎంపీ స్థానాలను కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ప్రజలు ఆలస్యం చేయకుండా తన విజ్ఞప్తి మేరకు వెంటనే పిల్లల్నికనాలని పిలుపునిచ్చారు.

ఎక్కువ మంది పిల్లల్ని కనాలని పిలుపు
కాగా, గతంలోనూ స్టాలిన్ ఇలాంటి విజ్ఞప్తే చేశారు. రాష్ట్ర ప్రజలు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 16 రకాల సంపదలకు బదులుగా 16 మంది పిల్లలను కనాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. పరిమితంగా పిల్లలను కని సంపదతో జీవించాలనే ఉద్దేశంతో కుటుంబ నియంత్రణ ప్రచారాన్ని చేపట్టామన్నారు. దీని కారణంగా రానున్న కాలంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు లోక్‌సభ స్థానాలు తగ్గే పరిస్థితి ఏర్పడిందన్నారు.
అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం
దక్షిణాది రాష్ట్రాల్లో డీలిమిటేషన్ సెగ రాజుకుంటున్నది. వచ్చే పార్లమెంట్ఎన్నికల నాటికి లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్రం భావిస్తోంది. కేంద్రం అనుసరించబోతున్న ఈ విధానంపై దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం భారీగా లాభపడతాయని ఐదు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ పార్టీల నేతలు మండిపడుతున్నారు.